Begin typing your search above and press return to search.

అమిత్ షాకు న‌ర‌కం చూపిన లిఫ్ట్‌

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:24 PM IST
అమిత్ షాకు న‌ర‌కం చూపిన లిఫ్ట్‌
X
భారతీయ జనతా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ఓ ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. పాట్నాలో గత రాత్రి ఆయ‌న బస ఆయ‌న చేసిన అతిథి గృహం లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయి చుక్క‌లు చూశారు. దాదాపు నలభై నిమిషాల సేపు అందులోనే ఉండిపోయి, ఆన‌క బ‌తుకు జీవుడా అని బ‌య‌ట‌ప‌డ్డారు. బీహార్ ఎన్నిక‌లు ముంచుకొస్తున్న రీత్యా గురువారం రాత్రి పొద్దు పోయేవరకు పార్టీనేతలతో సమావేశ‌మ‌య్యారు.

త‌ర్వాత నిద్ర‌కు ఉప‌క్ర‌మించేందుకు లిఫ్ట్ లో పైకి వెళుతుండగా సాంకేతిక లోపం త‌లెత్తి రెండు ఫ్లోర్ ల మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్ తలుపులు కూడా జామ్ అయ్యాయి. ఆయనతో పాటు నలుగురు నేతలు కూడా లిఫ్ట్‌లోప‌లే ఇరుక్కున్నారు. స‌మ‌యానికి లిఫ్ట్‌ ఆపరేటర్ కూడా అందుబాటులో లేడు. పోనీ లోప‌ల ఉన్న వారికి త‌మ ప‌రిస్థితి గురించి చెబుతామంటే.. ఫోన్ సిగ్నల్స్ కూడా జామ్ అయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని గమనించి లిఫ్ట్‌ తలుపులు విరగగొట్టి షాను, ఇతర నేతలను బయటకు తీసుకు వచ్చారు. ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో బీహార్ బీజేపీ నాయ‌కులు ఖంగుతిన్నారు. చివ‌ర‌కు షా సేఫ్‌గా బ‌య‌ట‌కు రావ‌డంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.