Begin typing your search above and press return to search.

అమిత్ షా నోటి వెంట రెండు యుద్ధాలు.. ఎందుకు? ఎవరితో?

By:  Tupaki Desk   |   29 Jun 2020 7:30 AM GMT
అమిత్ షా నోటి వెంట రెండు యుద్ధాలు.. ఎందుకు? ఎవరితో?
X
మోడీకి నీడలా.. ఆయన మాస్టర్ మైండ్ లో భాగంగా అభివర్ణించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాస్తంత దూకుడుగా చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. చైనాతో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఆయన నోటి వెంట యుద్ధం మాట రావటమే కాదు.. భారత్ చేసే రెండు యుద్ధాల్లో విజయం సాధిస్తామని చెప్పటం అందరి చూపు ఆయన మీద పడేలా చేసింది.

ప్రధాని మోడీ నాయకత్వంలో తాము రెండు యుద్ధాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేయటం గమనార్హం. భారత్ ను ఇబ్బందికి గురి చేస్తున్న కరోనామహమ్మారి మీదా.. చైనాతో ఘర్షణ అనే రెండు ప్రధాన సమస్యల్ని ఆయన రెండుయుద్ధాలుగా అభివర్ణిస్తూ రెండింటిలోనూ తాము విజయం సాధిస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం.

చైనా.. పాక్ లకు మేలు చేకూరేలా రాహుల్ వ్యాఖ్యలు చేయటం సరికాదని షా పేర్కొన్నారు. రాహుల్ వి చిల్లర రాజకీయాలుగా అభివర్ణించిన ఆయన.. పేరును నేరుగా ప్రస్తావించలేదు. ప్రధాని మోడీని సరెండర్ మోడీ అని వ్యాఖ్యానించటం తప్పు అన్న షా.. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

త్వరలో పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్నాయని.. చర్చలకు తాము భయ పడటం లేదన్న ఆయన.. 1962 నుంచి ఇప్పటి వరకూ అన్ని విషయాలపైనా చర్చిద్దామని చెప్పటం ద్వారా.. కాంగ్రెస్ లో కొత్త భయాన్ని కల్పించే ప్రయత్నం చేశారని చెప్పాలి. సమస్యల్ని యుద్ధాలు గా పేర్కొనటం ద్వారా.. వాటికి తాము ఇచ్చే ప్రాధాన్యత ను చెప్పటం తో పాటు.. వాటిలో విజయం సాధిస్తామని చెప్పటం ద్వారా ప్రజల్లో భావోద్వేగాన్ని టచ్ చేసేలా చేశారని చెప్పాలి.