మోడీ అంత సెన్సిటివ్ అయితే పెట్రో మోత మాటేంది షా?

Fri May 13 2022 11:08:59 GMT+0530 (IST)

amit shah on PM modi

గొప్పలు చెప్పుకోవటం తప్పే కాదు. కానీ.. నేల విడిచి సాము చేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం రావటమే కాదు.. కోట్లాది మంది ముందు అభాసుపాలు కావటం ఖాయం. తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన నరేంద్ర మోడీ గురించి..ఆయన మైండ్ సెట్ గురించి.. ఆయనెంత సున్నితంగా ఉంటారన్న విషయాల్ని ఏకరువు పెట్టారు కేంద్ర మంత్రి అమిత్ షా.ఆయన మాటలు విన్నంతనే మదిలో మెదిలే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారా? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. ఎనిమిదేళ్లుగా మోడీ పాలనను చూస్తున్న వారికి బోలెడన్ని సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా తాను చూసిన ఒక సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు అమిత్ షా. మోడీ ఎట్ 20.. డ్రీమ్ మీట్ డెలివరీ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించే సందర్భంగా మాట్లాడిన షా.. మోడీ ఎంతటి సున్నిత మనస్కుడన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ప్రధానమంత్రి ఆఫీసులో కీలక భేటీ నిర్వహిస్తున్న వేళ సమావేశ మందిరానికి అవతల ఉన్న వైపు ఒక నెమలి తన ముక్కుతో సమావేశ మందిరానికి గోడగా ఉన్న గ్లాస్ పలకను అదేపనిగా కొడుతోంది.

ఆ విషయాన్ని మోడీ గమనించారు. సాధారణంగా నెమలి ఆకలిగా ఉన్నప్పుడు అలాంటి పని చేస్తుంది. నెమలి ఆకలిగా ఉందన్న విషయాన్ని గ్రహించిన మోడీ సమావేశాన్ని మధ్యలో ఆపేసి.. ఆ పక్షికి ఆహారాన్ని అందజేయాలని తన సిబ్బందికి చెప్పారు’’ అంటూ మోడీ మాష్టారు గొప్పతాన్ని  కీర్తించేశారు అమిత్ షా.

మరి.. ఇంత సున్నిత మనస్కుడైన మోడీ మాష్టారు.. తాను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చన్న తర్వాత లీటరు పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎంత మేర పెంచారు? దాని కారణంగా సామాన్య.. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు.. ప్రజా రవాణా మొదలు అన్నింటిలోనూ పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరల ప్రభావం ఎంతన్నది తెలిసిందే. అంతకంతకూ పెరిగి పోతున్న పెట్రో ధరలతో బతుకు బండిని సామాన్యులు లాగలేని పరిస్థితి.

పెట్రో ధరల పెంపు కారణంగా తాము పడుతున్న అవస్థల్ని సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మరి.. వాటి గురించి ప్రధానమంత్రి మోడీకి ఎందుకు పట్టటంలేదు? నెమలి ఆకలితో ఉన్న విషయాన్ని గమనించి తట్టుకోలేని మోడీ మాష్టారు.. పెరిగిపోయిన పెట్రో ధరల కారణంగా కోట్లాది మంది చేస్తున్న హాహాకారాలు ఎందుకు వినిపించట్లేదు? ఆయనలోని సున్నిత మనస్కుడు ఎందుకు స్పందించటం లేదంటారు అమిత్ షాజీ?