Begin typing your search above and press return to search.

మోడీ చేసింది రామోజీ..సైనా ఇళ్ల‌కు వెళ్లి షా చెప్పాలా?

By:  Tupaki Desk   |   14 July 2018 7:02 AM GMT
మోడీ చేసింది రామోజీ..సైనా ఇళ్ల‌కు వెళ్లి షా చెప్పాలా?
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజా తెలంగాణ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో తెలంగాణ‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. రాష్ట్రానికి మోడీ స‌ర్కారు చాలా చేసిందంటూ ల‌క్ష‌ల కోట్ల రూపాయిల నిధులు ఇచ్చిన‌ట్లుగా గొప్ప‌లు చెప్పారు. షా మాట‌ల‌కు మండిప‌డిన కేసీఆర్‌.. త‌మ అప్ర‌క‌టిత స్నేహాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ అమిత్ షా మీద విరుచుకుప‌డ్డారు. నా అడ్డాలోకి వ‌చ్చి మ‌రీ న‌న్ను డ్యామేజ్ చేస్తావా? ఇలాంటివి వేరే రాష్ట్రంలో అయితే ఓకే.. నా ద‌గ్గ‌ర ఇలాంటి ప‌ప్పులు ఉడ‌క‌వ‌న్న సందేశాన్ని త‌న వ్యాఖ్య‌ల‌తో పంపార‌ని చెప్పాలి.

త‌న‌పై కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై షా వేరే వారి వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలా ఉంటే.. తాజా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యంలో దిగిన అమిత్ షా..త‌న కోసం వెయిట్ చేస్తున్న వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌కు ఒళ్లు మండేలా చేశారు. అన్య‌మ‌న‌స్కంగా అభివాదం చేశారే కానీ.. వారి మ‌న‌సుల్ని దోచుకునేలా మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. క‌నీసం వారి వైపు పెద్ద‌గా చూడ‌లేద‌న్న మాట వినిపిస్తోంది.

త‌న కోసం గంట‌ల కొద్దీ వెయిట్ చేస్తున్న వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌న దారిన తాను పోయిన షా తీరుపై బీజేపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు చాలానే హ‌ర్ట్ అయ్యార‌ని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ కార్యాల‌యానికి వెళ్లిన ఆయ‌న త‌ర్వాత త‌న షెడ్యూల్‌ లో భాగంగా మీడియా మొఘ‌ల్ రామోజీని క‌ల‌వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

పెద్ద మ‌నుషుల‌న్న త‌ర్వాత మాట్లాడుకోవాల్సిన‌వి చాలానే ఉంటాయి. అందులోకి రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన చిక్కుముడుల‌తో పాటు.. రానున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇత‌ర రాష్ట్రాల్లోనూ త‌న మీడియాతో ప్ర‌భావం చూపించే రామోజీ అవ‌స‌రం షాకు చాలానే ఉంది. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌ల్ని లైట్ తీసుకున్న ఆయ‌న‌.. రామోజీ ద‌గ్గ‌ర మాత్రం గంట‌ల కొద్దీ కాలాన్ని గ‌డ‌ప‌టం గ‌మ‌నార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌ర్వాత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లిన షా.. ఆమె కుటుంబ స‌భ్యుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నాలుగేళ్లుగా మోడీ పాల‌న‌లో జ‌రిగిన అభివృద్ధిని తెలియ‌జేసే పుస్త‌కాన్ని ఆమెకు అంద‌జేశారు. అనంత‌రం ట్విట్ట‌ర్ లో ఒక‌రికొక‌రు త‌మ భేటీ గురించి ట్వీట్లు చేసుకున్నారు. సంప‌ర్క్ ఫ‌ర్ స‌మ‌ర్థ‌న్ ప్రోగ్రాంలో భాగంగానే సైనాతో భేటీ అయిన విష‌యాన్ని షా వెల్ల‌డించారు.

అన్నింటికంటే కామెడీ ఏమంటే.. క్రీడాకారిణి సైనా కుటుంబ స‌భ్యుల‌ను తాను క‌లిసిన సంద‌ర్భంగా నాలుగేళ్ల మోడీ పాల‌న‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. అమిత్ షా లాంటి వ్య‌క్తి ఒక ప్ర‌ముఖ క్రీడాకారిణి ఇంటికి వెళ్లి మ‌రీ.. నాలుగేళ్ల మోడీ పాల‌న‌లో ఎంత అభివృద్ధి జ‌రిగింద‌న్న‌ది చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చూస్తుంటే.. సైనా ఇంటికి వెళ్లటం వెనుక బ‌య‌ట‌కు చెప్ప‌లేని కార‌ణం ఏదో ఉంద‌న్న అభిప్రాయం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. కేవ‌లం మోడీ స‌ర్కారు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల గురించి సైనాతో చెప్పుకోవాల్సిన అవ‌స‌రం షాకు లేదు క‌దా.

అదే రీతిలో.. రామోజీతో కూడా. మీడియా మొఘ‌ల్ ను క‌ల‌వ‌టానికి కార‌ణం.. మోడీ నాలుగేళ్ల పాల‌న గురించి వివ‌రించ‌టానికే అని చెప్పినా.. బ‌య‌ట‌కు చెప్ప‌లేని అంశాలే వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌న్న మాట పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. పార్టీ కోసం ప్రాణం అన్న‌ట్లుగా త‌పించిపోయే కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి ఐదు నిమిషాలు కేటాయించ‌టానికి మ‌న‌సొప్ప‌ని షా.. ప్ర‌ముఖుల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ మోడీ పాల‌న గురించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటారా?