Begin typing your search above and press return to search.

నిర్మల్ లో అమిత్ షా నివాళులు అర్పిస్తున్న ‘‘రాంజీ’’ ఎవరు?

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:21 AM GMT
నిర్మల్ లో అమిత్ షా నివాళులు అర్పిస్తున్న ‘‘రాంజీ’’ ఎవరు?
X
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు.. నిర్మల్ పట్టణానికి వస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న రాంజీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ విషయంలో నోరు మెదపకుండా ఉండే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వీలుగా.. బీజేపీ అగ్రనాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాంజీకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ఆయన చేసిన పోరును స్ఫూర్తిగా తర్వాతి తరాలకు మారింది. దీనికి తోడు నిర్మల్ పట్టణంలోని రాంజీ విగ్రహం చుట్టూ చెత్త.. మందుసీసాలతో ఆయన ప్రాణత్యాగానికి ఏ మాత్రం విలువ ఇవ్వని తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించేందుకు అమిత్ షా వస్తున్నారు.

ఇంతకీ ఈ రాంజీ ఎవరు? ఆయన చేసిన ప్రాణ త్యాగం ఏమిటి? గిరిజన వర్గానికి చెందిన ఆయనకు ఎందుకంత ప్రాధాన్యత? అప్పుడెప్పుడో 1857లో జరిగిన పోరాటం ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారిందన్న విషయాల్లోకి వెళితే.. దేశంలో జరిగిన మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్మల్ గడ్డ కూడా భాగమైంది. ఆ పోరును అణచివేసేందుకు ఆంగ్లేయులు భారీగా దళాల్ని దించారు. దీంతో పేరున్న నాయకులంతా చెల్లాచెదురయ్యారు. ఉత్తర భారతంలో పోరును నడిపిన తాంతియా తోపే అనుచరులైన రొహిల్లాలు నిర్మల్ ప్రాంతం వైపు వచ్చారు.

అప్పటికే అసిఫాబాద్ (జనగాం) ప్రాంతంలో పోరు చేస్తున్న స్థానిక గోండు యోధుడు రాంజీ నిర్మల్ తాలూకా మీదుగాఅడవుల్లోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్లేయులు.. నిజాంలను అడ్డుకునేందుకు నిర్మల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ గోండు వీరులకు రొహిల్లల దండు తోడైంది. వీరికి కొంతమంది దక్కనీలు.. మరాఠావాసులు కూడా తోడయ్యారు. ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు రొహిల్లాల సర్దార్ హజీతో రాంజీ కలిసి పోరు చేసేందుకు సిద్ధమయ్యారు. తమ వద్ద సరైన ఆయుధ సంపత్తి లేకున్నా.. నిర్మల్ భౌగోళిక పరిస్థితులపై పట్టు ఉన్న రాంజీ.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

గుట్టలు.. గొలుసుకట్టు చెరువులు.. పచ్చని అడవుల్ని అసరాగా చేసుకొని ఆంగ్లేయులు.. నిజాం సేనల మీద పోరు సాగించారు. స్థానిక బ్రిటిష్ కలెక్టర్ నేతృత్వంలో ఉండే సైనికుల్ని మట్టి కరిపించారు. రాంజీ.. రొహిల్లాలు.. మరికొందరు కలిసి పోరు ప్రారంభించారన్న విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ రాజ్యంలోని రెసిడెంట్ డేవిడ్ సన్ వారిని దెబ్బ తీసేందుకు ప్లాన్ చేస్తారు. నిర్మల్ కేంద్రంగా పురుడు పోసుకున్న పోరును పురిటిలోనే దెబ్బ తీయాలన్న కుయుక్తితో బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ ఫాంట్రీని నిర్మల్ కు పంపుతారు. కల్నర్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం నిర్మల్‌ చేరుకున్నా.. ఆ ప్రాంతం మీద అవగాహన లేకపోవటంతో రాంజీ సేన చేసిన గెరిల్లా పోరులో రాబర్ట్ సైన్యం రెండుసార్లు దెబ్బ తింటుంది. దీంతో.. రాంజీని దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించి సక్సెస్ అవుతారు. అతనితో పాటు.. వెయ్యి మందిని బందీలుగా పట్టుకుంటారు.

వారందరిని చిత్ర హింసలకు గురి చేసి.. అందరిని నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో ఉన్న మర్రిచెట్టుక వద్దకు తీసుకెళ్లి.. అందరూ చూస్తుండగానే రాంజీతో సహా వెయ్యి మందిని భారీ మర్రి చెట్టుకు ఉరి తీస్తారు. దేశం కోసం.. చిరునవ్వుతో ప్రాణాలు వదులుతారీ వీరులు. ఇంత పోరు సాగినప్పటికీ రాంజీ గోండు.. వెయ్యిమంది వీరుల చరిత్ర ఇప్పటికీ బయటకు రాకపోవటం గమనార్హం. జనరల్ డయ్యర్ సైన్యం వేయిమందిని పైగా కాల్చి చంపిన జలియన్ వాలా బాగ్ ఘటన కంటే 50 ఏళ్లు ముందు ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.

బ్రిటీష్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన రాంజీ తెగువ.. సాహసం చరిత్రలో నమోదైనా.. ప్రచారానికి నోచుకోలేదు. అంత దాకా ఎందుకు తెలంగాణ అన్నంతనే హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్ కు స్ఫూర్తి ఈ రాంజీ. కానీ.. ఇతని ప్రస్తావన మాత్రం పెద్దగా రాకపోవటం గమానార్హం. వీరుల బలిదానంతో వెయ్యి ఉరుల మర్రిగా మారిన చెట్టు 1995లో చోటుచేసుకున్న గాలివానకు నేలకొరిగింది. 2008 నవంబరు 14న నిర్మల్ లోని చైన్ గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా అమిత్ షా.. ఈ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తుండటంతో ఆయన వీరత్వం మరోసారి చర్చకు వచ్చింది.