Begin typing your search above and press return to search.

శ్రీశైలానికి అమిత్‌షా…రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

By:  Tupaki Desk   |   12 Aug 2021 5:30 AM GMT
శ్రీశైలానికి అమిత్‌షా…రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్
X
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత రెండో అత్యంత కీలక నేతగా పేరుపొందిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంకొద్ది గంటల్లో తెలుగు గడ్డపై అడుగుపెట్టనున్నారు. సడన్ సర్‌ ప్రైజ్ లాగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర హోం మంత్రి రాబోతున్న విషయం చివరి నిముషాల్లో వెల్లడికావడం గమనార్హం. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండిన నల్లమల అడవులకు అమిత్ షా వెళ్లనున్నారు. అయితే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి రాజకీయ పరంగా రావడం లేదు. దైవ దర్శనం నిమిత్తం ఏపీకి రాబోతున్నారు.

ప్రఖ్యాత శ్రీశైలం ఆలయంలో అమిత్ షా పూజలు చేయనున్నారు. కేంద్ర హోం శాఖ, బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అమిత్ షా గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ‌శైలం ఆలయానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్‌ కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉద‌యం 11.15 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకోనున్న అమిత్ షా అనంత‌రం ఇక్క‌డికి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో శ్రీ‌శైలానికి వెళ్ల‌నున్నారు.

మ‌ధ్యాహ్నం 12.25కు కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలంలోని సున్నిపెంట‌కు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వరకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం భ్రమరాంబా అతిథి గృహంలో అమిత్ షా భోజనం చేయ‌నున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో తిరిగి హైద‌రాబాద్‌ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.

లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలం వస్తుండటం గమనార్హం. జాతకం, రాశుల పరంగానూ ఆగస్టు 12కు ఏదైనా ప్రత్యేకత ఉందా అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. కాగా, నల్లమల అటవీప్రాంతం కావడంతో అమిత్ షా రాక సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి రాక సందర్భంగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ అంతర్గతంగా అలర్ట్ కొనసాగుతుంది. అమిత్ షా తో పాటుగా శ్రీశైలం ఆలయానికి ఆయన కుటుంబీకులు కూడా వస్తున్న నేపథ్యంలో హోం మంత్రి పర్యటనలో రాజకీయ కలయికలు ఉంటాయా లేదా అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు శ్రీశైలంలో షాను కలవొచ్చని తెలుస్తోంది.