Begin typing your search above and press return to search.

భాషపై గురిపెట్టిన అమిత్ షా..సాధ్యమయ్యే పనేనా..?

By:  Tupaki Desk   |   14 Sept 2019 3:37 PM IST
భాషపై గురిపెట్టిన అమిత్ షా..సాధ్యమయ్యే పనేనా..?
X
అమిత్ షా కేంద్ర మంత్రి అయిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రద్దు - జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలని తెరపైకి తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేశారు. ఈ క్రమంలోనే అమిత్ షా మరో సంచలన నిర్ణయం దిశగా వెళుతున్నారు. ఒకే దేశం...ఒకే పన్ను అంటూ జిఎస్‌ టిని ఏ విధంగా తీసుకొచ్చారో...అలాగే ఒకే దేశం ఒకే బాష అనే నినాదం అంటూ సంచలనం సృష్టించారు. శనివారం హిందీ భాషా దినోత్సవం సందర్భంగా...అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

భిన్నభాషలు - యాసలు ఉండటం మనదేశపు బలమైనా - కానీ మనదేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉందని - అప్పుడే విదేశీ భాషలకు చోటుండదని చెప్పారు. అందుకే స్వాతంత్య్ర‌ పోరాటం సందర్భంగా మన పూర్వీకులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారని ట్వీట్ చేశారు. ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని - హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతీయులంతా మహాత్మాగాంధీ - సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.

అయితే షా అనుకున్న విధంగా ఒకే బాష దేశమంతా మాట్లాడటం అసాధ్యం. అలా కాకుండా ఒకే బాషని అమలు చేయాలని చూస్తే... మరాఠీ - కన్నడ - తమిళం - బెంగాళీ - తెలుగు వాళ్ల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇంకా ఏవైనా సంచలన నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలరు గానీ... బాష విషయంలో ముందుకెళ్లే దమ్ము ధైర్యం మోడీ - షాలకు లేవు.

ఇప్పటికే అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత - ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.