Begin typing your search above and press return to search.

నోరు జారి త‌ప్పు చేశానంటున్న అమిత్ షా

By:  Tupaki Desk   |   30 March 2018 11:30 AM GMT
నోరు జారి త‌ప్పు చేశానంటున్న అమిత్ షా
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే అలా చెప్పింది ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కో ఇంకెవ‌రికో కాదు. నోరు జారిన కార‌ణంగా ఇలా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతిపరుడంటూ షా ఇటీవలే నోరు జారిన సంగ‌తి తెలిసిందే. యడ్యూరప్ప అవినీతిపరుడు అని తాను వ్యాఖ్యానించడం తప్పేనని అమిత్ షా పేర్కొన్నారు. సిద్ధరామయ్య పేరుకు బదులుగా యడ్యూరప్ప పేరును పొరపాటున వాడానని చెప్పారు. ఈ చిన్న పొరపాటుకు కాంగ్రెస్ నేతలంతా ఆనందించడం మొదలు పెట్టారని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ నేతలు అల్ప సంతోషులు అని అమిత్ షా ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామని అమిత్ షా పేర్కొన్నారు. `రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా.. నేనేదో పొరపాటు చేశాను. కానీ కర్ణాటక ప్రజలు మాత్రం పొరపాటు చేయరన్న విషయాన్ని గ్రహించాలి` అని అమిత్ షా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 24 మందికి పైగా ఆర్‌ ఎస్‌ ఎస్ - బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని షా చెప్పారు. ఈ హత్యలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అమిత్ షా తెలిపారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

మ‌రోవైపు అమిత్ షా నోరు జారిన ఇంకో ఎపిసోడ్‌ ను కాంగ్రెస్ వాడుకుంది. దళితులతో అమిత్ షా సమావేశమైన సందర్భంగా వారిని ఉద్దేశించి అమిత్ షా హిందీలో ప్రసంగించారు. ఈ హిందీ ప్రసంగాన్ని కన్నడ భాషలో బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి ట్రాన్స్‌లేట్ చేశారు. `సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివృద్ధి చేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంచి యడ్యూరప్పకు ఓటేయండి. కర్ణాటకను అభివృద్ధిలో నెంబర్‌ వన్ తీర్చిదిద్దుతాం` అని అమిత్ షా హిందీలో చెప్పారు. ఈ వ్యాఖ్యలను కన్నడలో ట్రాన్స్‌ లేట్ చేసిన ఎంపీ ప్రహ్లాద్ జోషి నోరు జారారు. ప్రధాని నరేంద్ర మోడీ దళితుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని జోషి అన్నారు. జోషి వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్‌ లో స్పందించారు. బీజేపీ నేతలందరూ నిజాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.