Begin typing your search above and press return to search.

పాక్ ను హెచ్చరించిన అమెరికా పత్రిక!

By:  Tupaki Desk   |   28 Sep 2016 6:47 AM GMT
పాక్ ను హెచ్చరించిన అమెరికా పత్రిక!
X
ఉడీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై ప్రపంచ దేశాలన్నీ విమర్శలు చేస్తున్నాయి... ప్రపంచ వేదికల మీద భారత్ కూడా పాక్ ను కడిగిపారేస్తుంది. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పాకిస్థాన్ ను హెచ్చరిస్తూ ఒక కథనం ప్రచురించింది. ఈ విషయంలో తాను చెప్పాలనుకున్న విషయాలను మోడీ భావిస్తున్నారన్నట్లు ప్రచురించిన ఆ పత్రిక... చెప్పాలనుకున్న విషయం మాత్రం సూటిగానే చెప్పింది. ఈ కథనంలో భారత్ వాదనను దాదాపు వినిపించిన ఈ పత్రిక - పాక్ కు సూచనలతో పాటు - హెచ్చరికలు కూడా చేసింది. మోడీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి భారతీయుల ఆగ్రహాన్ని చవిచూడొద్దని, అలాంటి తింగరి పనులు చేస్తే పనికిమాలిన దేశంగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించిది.

ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్ ఇప్పటివరకూ పాక్ పై తిరిగీ దాడి చేయలేదంటే దాన్ని చేతకానితనంగా భావించొద్దని - అది కచ్చితంగా భారతదేశ వ్యూహాత్మక సహనం అని ఆ పత్రిక తెలిపింది. భారతదేశ సహనాన్ని ఏమాత్రం అలుసుగా తీసుకున్నా పూర్తిగా నష్టపోయేది పాకిస్థానేనని వాల్‌ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదే సమయంలో ఇస్లామాబాద్ ఈ వైఖరి ఎక్కువకాలం అవలంబించడం ఏమాత్రం సరికాదని - అలా చేస్తే పనికిరాని దేశంగా పాక్ మిగిలిపోతుందని చెప్పింది.

ఉగ్రవాద విషయంలో భారత్ నైతిక విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉందని, ఆ విషయాన్ని గట్టిగా చెప్పడంలో గతంలో ఉన్న కాంగ్రెస్ - బీజేపీ ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని, అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అలా చూస్తూ ఉంటుందని అనుకుంటే అది పాక్ చేసే పెద్ద తప్పవుతుందని ఆ పత్రిక పేర్కొంది. ఇదే క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదన్న భారత ప్రధాని నిర్ణయాన్ని ఈ పత్రిక ప్రశంసించింది. దానికి బదులు పాకిస్థాన్‌ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అది పాక్ ను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని తెలిపింది. ఇదే క్రమంలో 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం - మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తప్పించడం వంటి చర్యల ద్వారా పాక్‌ ను అణగదొక్కే ప్రయత్నాలపై భారత్ ఇప్పటికే ఆలోచిస్తుందని ఆ కథనంలో వివరించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/