Begin typing your search above and press return to search.

అమెరికా సబ్ మెరైన్ ప్ర‌మాదం.. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఉద్రిక్త‌త‌

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:00 PM IST
అమెరికా సబ్ మెరైన్ ప్ర‌మాదం.. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఉద్రిక్త‌త‌
X
అమెరికాకు చెందిన అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన జలాంత‌ర్గామికి .. ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల్లో ప్ర‌మాదం జ‌రిగింది. గుర్తుతెలియ‌ని ఏదో ఒక వ‌స్తువు ఆ స‌బ్‌మెరైన్‌ను ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో అమెరికా నేవీ సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతం ఇటీవ‌ల వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ప‌హారాకాస్తున్న అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ క‌న‌క్టిక‌ట్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. అక్టోబ‌ర్ రెండ‌వ తేదీన జ‌రిగిన ప్ర‌మాదంలో 15 మంది నావికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. అయితే స‌బ్‌మెరైన్‌ను ఢీకొన్న‌ది ఏంట‌న్న విష‌యం ఇంకా స్ప‌ష్టం కాలేదు.

ఇటీవ‌ల తైవాన్ వాయు ర‌క్ష‌ణ వ‌ల‌యంలోకి చైనా విమానాలు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. దెబ్బ‌తిన్న అమెరికా యుద్ధ జ‌లాంత‌ర్గామి ప్ర‌స్తుతం గువామ్ దిశ‌గా వెళ్తున్న‌ట్లు నేవీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. క‌న‌క్టిక‌ట్‌లో జ‌లాంత‌ర్గామిలో ఉన్న న్యూక్లియ‌ర్ ప్రొప‌ల్ష‌న్ ప్లాంట్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు నేవీ ప్ర‌తినిధి తెలిపారు. స‌బ్‌మెరైన్‌కు ఎంత న‌ష్టం జ‌రిగిందో కూడా అంచ‌నా వేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. పిలిప్పీన్స్‌, బ్రూనై, మ‌లేషియా, తైవాన్‌, వియ‌త్నాం దేశాలు కూడా చైనాతో స‌ముద్ర జ‌లాల విష‌యంలో పేచీకి దిగుతున్నాయి. అయితే వివాదాస్ప‌ద‌మైన ఆ ప్రాంతంలోనే అమెరికా జ‌లాంత‌ర్గామి ప్ర‌మాదానికి గురైంది.

మ‌రో వైపు తైవాన్‌, చైనా మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై అమెరికా స్పందించింది. తైవాన్ ప‌ట్ల చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని అమెరికా సెక్యూర్టీ అడ్వైజ‌ర్ జేక్ సుల్వియ‌న్ తెలిపారు. చైనాతో యుద్ధం త‌ప్ప‌ద‌ని ఇటీవ‌ల మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం జలాంతర్గామి.. గువామ్‌లోని పోర్టు వైపు వెళ్లింది. దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదని చెబుతోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. దీనిపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు… చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్‌ గగనతలంలోకి చొచ్చుకువెళ్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి సబ్‌మెరైన్‌కు ప్రమాదం తప్పినా… భవిష్యత్‌లో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. దెబ్బతిన్న అణు జలంతర్గామి వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నామని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని అమెరికా నౌకాదళం తెలిపింది. ప్రమాదంలో దెబ్బతిన్న నౌక గువామ్ లోని యూఎస్ స్థావరానికి వెళుతోందని సమాచారం.