Begin typing your search above and press return to search.

కత్తి ఉందని నల్లజాతీయుడ్ని చుట్టుముట్టి చంపేసిన అమెరికా పోలీసులు!

By:  Tupaki Desk   |   23 Aug 2020 10:50 AM GMT
కత్తి ఉందని నల్లజాతీయుడ్ని చుట్టుముట్టి చంపేసిన అమెరికా పోలీసులు!
X
అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రపంచ దేశాలకు నిత్యం మానవ హక్కుల గురించి నీతులు చెప్పే పెద్దన్న రాజ్యం మరో ఆరాచకపు ఘటనకు వేదికైంది. కొద్ది నెలల క్రితం ఒక నల్లజాతీయుడ్ని దారుణంగా హతమార్చిన ఉదంతంపై యావత్ అమెరికా రగిలిపోవటం తెలిసిందే. పోలీసుల ఆరాచకానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ దారుణం లుసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో చోటు చేసుకుంది.

బెన్ క్రంప్ అనే పౌరహక్కుల న్యాయవాది పోస్టు చేసిన ఈ పోస్టు ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారటంతో పాటు..మరోసారి నల్లజాతీయుల విషయంలో శ్వేతజాతి పోలీసులు వ్యవహరించే తీరు ఎంత దారుణంగా ఉంటుందన్నది తెర మీదకు వచ్చింది. ఒక నల్లజాతీయుడు చేతిలో కత్తి ఉందన్న కారణంగా అతడ్ని పోలీసులు చుట్టుముట్టి అమానుషంగా కాల్చి చంపటంపై నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

కత్తి ఉంటే మాత్రం కాల్చిచంపేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యక్తిని ట్రేఫోర్డ్ పెల్లెరిన్ గా గుర్తించారు. కత్తిలాంటి పదునైన ఆయుధం ఉన్న వ్యక్తిని గుర్తించి.. అతడి కారణంగా ఏదైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించినప్పుడు.. మోకాలు కింది బాగంలో కాలిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా.. నిందితుడు చుట్టూ చేరిన పోలీసుల.. విచక్షణ రహితంగా కాల్చేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దాదాపు పది రౌండ్ల వరకు పోలీసులు కాల్పులు జరిపినట్లుగా చెబుతున్నారు. తాజాగా ప్రపంచం ముందుకు ఈ దారుణ వీడియోను తీసుకొచ్చిన న్యాయవాది.. ఈ మధ్యనే పోలీసుల అమానుషానికి బలైన జార్జ్ ప్లాయిడ్ కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదే.. తాజా వీడియోను షేర్ చేయటం గమనార్హం. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొచ్చేసిన వేళ.. శ్వేతజాతి పోలీసుల ఆరాచకం.. అమెరికాలో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.