Begin typing your search above and press return to search.

ఈసారికి మిస్ యూనివర్స్ గా అమెరికన్ బ్యూటీ

By:  Tupaki Desk   |   16 Jan 2023 5:35 AM GMT
ఈసారికి మిస్ యూనివర్స్ గా అమెరికన్ బ్యూటీ
X
పేరుకు అగ్ర రాజ్యమే కానీ అందాల పోటీలో తన సత్తా చాటలేకపోతుందన్న భావనకు చెక్ పెడుతూ.. ఈసారి మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది యూఎస్ బ్యూటీ. అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022గా నిలిచింది.

విజేతగా నిలిచిన ఆమెకు భారత్ కు చెందిన మాజీ విశ్వసుందరి హర్నాజ్ సంధు కిరిటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. తాజాగా విజేతగా నిలిచిన యూఎస్ బ్యూటీతో అగ్రరాజ్యం పదోసారి ఈ టైటిల్ ను సొంతం చేసుకుంది. పోటీ చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ విన్నర్ గా అమెరికా అవతరించింది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. గడిచిన పదేళ్లలో యూఎస్ బ్యూటీకి ఈ టైటిల్ తొలిసారి సొంతం కావటం. ఈ పోటీలో రన్నరప్ గా మిస్ వెనిజులా నిలిచింది. మిస్ డొమిన్ కన్ రిపబ్లిక్ బ్యూటీ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా బ్యూటీ దివిట రాయ్ టాప్ ఫైవ్ లోనూ స్థానం సొంతం చేసుకోలేకపోయారు. టాప్ 16లో మాత్రం ఆమెకు స్థానం దక్కింది.

ఈ అందాల పోటీలు తాజాగా అమెరికాలోని లూసియానాలో భారీ ఎత్తున జరగ్గా.. 80 దేశాలకు చెందిన సుందరీమణులు టైటిల్ కోసం పోటీ పడ్డారు. కొత్తగా ఎన్నికైన మిస్ యూనివర్స్ కు కిరీటాన్ని అందించేందుకు వేదిక మీదకు వచ్చిన గత ఏడాది మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు భావోద్వేగానికి గురయ్యారు. వేదిక మీద నడుస్తున్న వేళ.. ఆమె కంటి నుంచి కన్నీళ్లు ఉబికి రావటం..

వాటిని ఆపుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరో ఇంట్రస్టింగ్ అంశం ఏమంటే.. తాజా వేదిక మీద హర్నాజ్ సంధు ధరించిన ప్రత్యేక గౌను మీద మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ ఫోటో ఉండటం అందరిని ఆకర్షించింది. సుస్మితా సేన్ 1994లో జరిగిన ఈ పోటీలో విజేతగా నిలవటం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.