Begin typing your search above and press return to search.

ఆ కీల‌క అంశంలో భార‌త్ కు అమెరికా మ‌ద్ధ‌తు

By:  Tupaki Desk   |   25 Sep 2021 1:30 PM GMT
ఆ కీల‌క అంశంలో భార‌త్ కు అమెరికా మ‌ద్ధ‌తు
X
మ‌రో కీల‌క అంశంలో భార‌త్ కు అగ్ర‌రాజ్యం అమెరికా మ‌ద్ధ‌తు ల‌భించింది. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం ఎదురుచూస్తున్న భార‌త్ కు అమెరికా మ‌ద్ధ‌తు ల‌భించింది. ఇండియాకి శాశ్వ‌త స‌భ్య‌త్వం ఉండాల్సిందేన‌ని, ప్రపంచంలో శాంతి నెల‌కొల్పేందుకు ఇండియా త‌న వంతు పాత్ర పోషిస్తుంద‌ని అమెరికా అభిప్రాయ‌ప‌డింది. ఐక్య‌రాజ్య‌స‌మితి వ్య‌వ‌స్థాప‌క దేశాల్లో ఇండియా కూడా ఒక‌టి. ఏడుసార్లు తాత్కాలిక స‌భ్య‌దేశంగా కూడా ప‌నిచేసిందని, ఆప్ఘ‌న్ విష‌యంలో భార‌త్ వ్య‌వ‌హ‌రించిన తీరు అద్భుత‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో మొత్తం 15దేశాలుంటాయి. ఇందులో 5 దేశాల‌కు మాత్ర‌మే శాశ్వ‌త స‌భ్య‌త్వం ఉంది. మిగిలిన దేశాల‌ను రెండు సంవ‌త్సరాల కాల‌ప‌రిమితితో తాత్కాలిక స‌భ్య దేశంగా ఎన్నుకుంటారు. ఆగస్టు నెలలో యూఎన్ ఎస్పీ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్, ఆప్ఘనిస్థాన్ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని జో బైడెన్ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో భేటీ అనంతరం బైడెన్ మీడియా సమావేశంలో ఈ మేరకు స్పందించారు.

కాగా, ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ కు ఇప్పటికే శాశ్వత సభ్యత్వం రావాల్సి ఉంది. కానీ, చైనా, పాక్ దేశాలు అడ్డుపుల్లలు వేస్తున్నాయి. ఇది ఇలావుండగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికాలోని భారత కమ్యూనిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతీయ ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండే హెచ్1బీ వీసా అంశంపైనా మోడీ, బైడెన్‌తో చర్చించారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్‌తో ప్రధాని మోడీ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ భేటీలో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, సత్ససంబంధాలు మరింత దృఢంగా కొనసాగుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారతీయ నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసా అంశంపై బైడెన్‌ తో ప్రధాని మోడీ చర్చించారు. అనేక మంది భారతీయ నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని, మరికొంత మంది ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. 2021లో రికార్డు స్థాయిలో 62,000 మంది విద్యార్థులకు అమెరికా వీసాలను మంజూరు చేసింది. కాగా, దాదాపు 2 లక్షల మంది వరకు ఇక్కడ ఉన్న భారతీయు విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి 7.7 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అందిస్తున్నారు.