Begin typing your search above and press return to search.

సరోగసీ బిల్లు 2019కు కీలక సవరణ‌లు!

By:  Tupaki Desk   |   6 Feb 2020 2:39 PM GMT
సరోగసీ బిల్లు 2019కు కీలక సవరణ‌లు!
X
ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మాతృత్వ‌పు మాధుర్యాన్ని అనుభ‌వించలేని మ‌హిళ‌ల‌కు గొప్ప వ‌రం స‌రోగ‌సీ ప్ర‌క్రియ. అనారోగ్య కార‌ణాలు - ఇన్‌ ఫెర్టిలిటీ స‌మస్య‌ల‌తో గ‌ర్భం దాల్చ‌లేని మ‌హిళ‌ల‌కు స‌రోగ‌సీ(అద్దె గ‌ర్భం) ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చే స‌రోగ‌సీ ప్ర‌క్రియపై అనుకూల‌ - ప్ర‌తికూల వాద‌న‌లున్నాయి. స‌రోగ‌సీని క‌మ‌ర్షియ‌లైజ్ చేశార‌ని - దానినో వ్యాపారంలా మార్చార‌ని కొంద‌రి వాద‌న. ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది నవంబరులో రాజ్యసభలో సరోగసి(రెగ్యులేషన్) బిల్లు 2019ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ బిల్లులో సవరణల కోసం 10 సార్లు సమావేశమైన 23 మంది సభ్యుల ప్యానెల్ తాజాగా రాజ్యసభ ఛైర్మన్ భూపేంద్ర యాదవ్‌ కు నివేదిక అందజేసింది. ఈ బిల్లుకు మొత్తం 15 సవరణలను ప్యానెల్ సూచించింది.

దగ్గరి బంధువులే కాకుండా - ఇష్టపూర్తిగా ఒప్పుకునే ఏ మహిళనైనా సరోగసీకి అనుమతించాలని ప్యానెల్ సూచించింది. 35-45 ఏళ్ల మధ్యలో ఉన్న ఒంటరి మహిళలైన వితంతువులు - విడాకులు తీసుకున్న మహిళలకు కూడా సరోగసీకి అనుమ‌తించాల‌ని చెప్పింది. ఇన్‌ఫర్టిలిటీ అంటే ఐదేళ్ల అసురక్షిత సంభోగం అనంత‌రం పిల్లలు పుట్ట‌కుంటే సరోగసీకి అనుమతినివ్వడం సరికాదని, ఆ నిర్వ‌చనం తొల‌గించాల‌ని తెలిపింది. అన్ని కేసుల్లో స‌రోగ‌సీకి ఇన్‌ ఫర్టిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలని కోరడం సరికాద‌ని తెలిపింది. సరోగసీకి ఒప్పుకునే మహిళకు ఆరోగ్య భీమాను 16 నెలల నుంచి 36 నెలలకు పెంచాలని ప్రతిపాదించింది.

స్వచ్చందంగా పరోపకార సరోగసీకి ముందుకు వ‌చ్చే మ‌హిళ‌ల‌ను స్వాగ‌తించాల‌ని ప్యానెల్ అభిప్రాయ‌ప‌డింది. కమర్షియల్ సరోగసీ ఓ మెకానికల్ పెయిడ్ సర్వీస్ అని, ఆ సరోగసీ అవసరం లేదని స్పష్టం చేసింది. సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల ప్రయోజనాలను కాపాడేందుకు.. పేరేంటేజ్ - చిన్నారుల సంరక్షణకు సంబంధించి మెజిస్ట్రేట్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని ప్యానెల్ సూచించింది. కాగ‌, సరోగసీ బిల్లు రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ప్యానెల్ సూచించిన స‌వర‌ణ‌ల‌పై చ‌ర్చించిన అనంత‌రం బిల్లుకు పెద్ద‌ల స‌భ ఆమోదం తెలిపే అవ‌కాశ‌ముంది.