Begin typing your search above and press return to search.

లోకేష్ గాలి తీసేసిన బాలయ్య ఫ్రెండ్

By:  Tupaki Desk   |   13 Feb 2020 9:35 AM IST
లోకేష్ గాలి తీసేసిన బాలయ్య ఫ్రెండ్
X
అంబికా దర్బార్ బత్తి అధినేతగా వెలుగులోకి వచ్చి.. ఆపై సినీ నిర్మాతగా పేరు సంపాదించి.. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ప్రవేశించి తెలుగు వాళ్లకు సుపరిచితుడైన వ్యక్తి అంబికా కృష్ణ. తెలుగుదేశం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు అంబికా కృష్ణ చాలా సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో ఆయన సినిమాలు కూడా తీశాడు. అలాంటి వ్యక్తి బాలయ్య అల్లుడు, తెలుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి కొడుకు అయిన నారా లోకేష్ గాలి తీసేలా మాట్లాడటం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును పొగిడినట్లే పొగిడి విమర్శలూ గుప్పించాడు అంబికా కృష్ణ ఈ ఇంటర్వ్యూలో. చంద్రబాబుకు ఎఫ్పడూ తన ఎదుగుదల గురించే ఆలోచన అని.. తాను పదవిలోకి రావడానికి ఏం చేయాలి అని మాత్రమే చూస్తాడని.. తనను నమ్ముకున్న వాళ్ల గురించి ఆయన పట్టించుకోరని.. అందుకే పార్టీ దారుణమైన పరిస్థితికి చేరుకుందని అంబికా కృష్ణ అన్నారు. అలాగే చంద్రబాబుకు వైశ్య కులం అంటే చులకన భావం అని.. వాళ్లను అసలు పట్టించుకోడని.. దీని వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించాడు కృష్ణ.

మరోవైపు నారా లోకేష్ గురించి అంబికా కృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు సమర్థుడని.. కానీ ఆయన కొడుకైన లోకేష్‌ ఆ లక్షణాలు పుణికి పుచ్చుకోలేదని.. అతను లాభం లేదని తేల్చేశాడు అంబికా కృష్ణ. లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ కి ఉపయోగం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టాడు. బాలయ్యకు సన్నిహితుడిగా పేరున్న కృష్ణ.. ఇలా ఆయన అల్లుడి గురించి ఇంత ఓపెన్‌గా కామెంట్లు చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. లోకేష్ గురించి ఇది పాపులర్ ఒపీనియనే అయినప్పటికీ.. ఇలా ఓపెన్ కామెంట్ చేయడం మాత్రం సంచలనమే.