Begin typing your search above and press return to search.

అంబేడ్క‌ర్‌ ను అవ‌మానించింది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   17 Dec 2015 7:34 AM GMT
అంబేడ్క‌ర్‌ ను అవ‌మానించింది ఎవ‌రు?
X
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలేమో కానీ.. సంబంధం లేని అంశాలు వివాదాస్ప‌ద‌మవుతున్నాయి. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన ఏపీ శీతాకాల స‌మావేశాలు ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ముగిశాయి. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గౌర‌వించాల్సిన వ్య‌క్తుల విష‌యంలోనూ రాజ‌కీయాలే పైచేయి సాధించాయి. ఏపీరాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మ‌నీ అంశంపై చ‌ర్చ‌కు విప‌క్షం ప‌ట్టుబ‌ట్టింది. దీనికి అధికార‌ప‌క్షం స్పందిస్తూ.. అంబేడ్క‌ర్ 125 జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఒక‌రోజు చ‌ర్చ జ‌రుపుకుందామ‌ని.. శుక్ర‌వారం కాల్ మ‌నీ అంశం మీద చ‌ర్చ చేద్దామ‌ని చెప్పింది. నిన్న‌టివ‌ర‌కూ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌లేదు. కాల్ మ‌నీ మీద చ‌ర్చించ‌లేదు. ఏమైనా జ‌రిగిందా?

ఒక్క‌రోజు కాల్ మ‌నీ మీద చ‌ర్చ జ‌ర‌ప‌కుంటే కొంప‌లు మునిగిపోయేదేమీ లేదు. కానీ.. స‌భ ప్రారంభ‌మైన రోజున రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ కోసం కేటాయించి.. ఆయ‌న న‌డిచిన దారిని స్మ‌రించుకోవ‌టం వ‌ల్ల కాసిన్ని విలువ‌లు చెవినెక్కే అవ‌కాశం ఉంది. కానీ.. విప‌క్షం మొండిగా వ్య‌వ‌హ‌రించ‌టం..త‌మ నోటి వెంట నుంచి వ‌చ్చిన కాల్ మ‌నీ వ్య‌వ‌హారం మీద త‌ప్పించి.. వేరే ఏ అంశం మీదా బిజినెస్ జ‌ర‌గ‌టానికి వీల్లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో స‌భ ప‌లుమార్లు వాయిదా ప‌డింది.

దేశ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్క‌ర్ గురించి మాట్లాడేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని ఏపీ విప‌క్ష స‌భ్యుల వైఖ‌రి చిత్రంగా ఉంద‌నే చెప్పాలి. ఏ రాజ్యాంగానికి అనుగుణంగా తాముఎన్నిక అయ్యారో.. అదే రాజ్యాంగాన్ని రూపొందించిన వ్య‌క్తి గురించి.. ఒక ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని చ‌ర్చ చేయ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అలాంటిదేమీ ప‌ట్టించుకోకుండా తాము ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసెంబ్లీలోజ‌గ‌న్ బ్యాచ్ వైఖ‌రి చూస్తే.. అంబేడ్క‌ర్ ను అవ‌మానించిన‌ట్లుగా ఉందని ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు విరుచుకుపడుతున్నారు. దేశానికి మార్గ‌ద‌ర్శ‌కులైన వ్య‌క్తుల విష‌యంలో కాసింత సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యాన్ని రాజ‌కీయ పార్టీ నేత‌లు గుర్తించ‌టం మంచిది.