Begin typing your search above and press return to search.

ఆ ఓట్ల గ‌ల్లంతు వెనుక టీడీపీ కుట్ర‌?

By:  Tupaki Desk   |   3 Nov 2018 1:30 AM IST
ఆ ఓట్ల గ‌ల్లంతు వెనుక టీడీపీ కుట్ర‌?
X
ప్ర‌స్తుతం తెలంగాణ‌ లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి రాజు కున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది. టీఆర్ ఎస్...విప‌క్ష పార్టీల‌కు చెందిన ఓట్ల‌ను తొల‌గించింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఓట‌ర్ల న‌మోదు గ‌డువు తేదీని పెంచాల‌ని కాంగ్రెస్ నేత‌లు సుప్రీం త‌లుపు కూడా త‌ట్టారు. దాదాపుగా ఆంధ్ర ప్ర‌దేశ్ లోనూ అటువంటి ఆరోప‌ణ‌లే వ‌స్తున్నాయి. త‌మ ఓట‌ర్ల‌ను తొల‌గించేందుకు టీడీపీ కుట్ర ప‌న్నుతోంద‌ని వైసీపీ - జ‌న‌సేన‌లు ఆరోపిస్తున్నాయి. మొన్న పాత గుంటూరు లో వైసీపీ నేత‌ల ఓట్ల తొల‌గింపు క‌ల‌క‌లం రేప‌గా...నిన్న జ‌న‌సేన ఓట్ల తొల‌గింపు వార్త దుమారం రేపింది. త‌మ పార్టీకి చెందిన ఓట్ల‌ను కావాల‌నే తొల‌గిస్తున్నార‌ని ఆ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

స‌ర్వేల ముసుగులో త‌మ ఓట్ల తొల‌గింపున‌కు టీడీపీ కుట్ర ప‌న్నుతోంద‌ని వైసీపీ - జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. పాత గుంటూరులో రెండు రోజుల క్రితం సెంట‌ర్ ఫ‌ర్ సోషియే పొలిటిక‌ల్ ఎనాల‌సిస్ (సీఎస్ పీఏ)కు చెందిన వ్య‌క్తులు ప్రీపోల్ స‌ర్వే నిర్వ‌హించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటేస్తారంటూ వివరాలు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఓట‌రు ఐడీ నెంబ‌రు చెప్పాల‌ని సీఎస్ పీఏ ప్ర‌తినిధులు...స్థానికుల‌ను అడిగారు. దీంతో - స‌ర్వే కు ఓట‌రు ఐడీతో ఏం ప‌ని అంటూ అనుమానం వ్య‌క్తం చేసిన స్థానికులు....ఆ సంస్థ ప్ర‌తినిధుల‌ను నిల‌దీశారు. వారిని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ర‌కంగా త‌మ ఓట్ల కిడ్నాప్ ల‌కు టీడీపీ పాల్ప‌డుతోంద‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. అంత‌కుముందు - గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్త‌ఫా కూడా...ఇదే త‌ర‌హాలో ఓట్లు తొల‌గిస్తోన్న బోగ‌స్ స‌ర్వే ప్ర‌తినిధుల‌ను ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆ ఘ‌ట‌న‌ పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. త‌మ ప్ర‌త్య‌ర్థుల ఓట‌ర్లును తొల‌గించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని టీడీపీ దుర్వినియోగం చేస్తోంద‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఆరోపించారు. మ‌రి, ఆ ఫిర్యాదుల నేప‌థ్యంలో టీడీపీ పై ఈసీ ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.