Begin typing your search above and press return to search.

బాబు మాట.. ఖండ ఖండాలుగా ఖండించొద్దు..

By:  Tupaki Desk   |   26 Oct 2018 4:19 PM IST
బాబు మాట.. ఖండ ఖండాలుగా ఖండించొద్దు..
X
ఇది ప్రజాస్వామ్యమప్ప.. ఎవరు దేనిమీదైనా స్పందించొచ్చు.. నచ్చకపోతే ఖండించవచ్చు. దేశం మొత్తం మీద ఎక్కడైనా ఖండించుకోండి కానీ ఏపీలో మాత్రం ఖండించకండి.. అక్కడ ఖండిస్తే బాబు ఊరుకోడు.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఖండనలంటే నచ్చవు మరీ.. పక్కరాష్ట్రం వాళ్లైనా.. ఢిల్లీ పెద్దలైనా.. బాబా ఇలాకాలో ఏం జరిగినా ఖండిచొద్దబ్బా.. ఖండిస్తే ఆయన ఊరుకోడు మరీ..

ఏపీ స్వతంత్ర్య రాజ్యమైపోయింది. చంద్రబాబు రాజును మించి చక్రవర్తి అయిపోయాడు. అక్కడ ప్రజాస్వామ్యం కునారిల్లిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేతపై పట్టపగలు మిట్టమధ్యాహ్నం హత్యాయత్నం జరిగితే దేశం మొత్తం షాక్ కు గురయ్యింది. దాడి జరిగిన ప్రాంతం ఏపీ భూభాగంలో లేనట్టు.. అది తమకు సంబంధం లేదన్నట్టు చక్రవర్తిగారు సెలవిచ్చారు. పోనీలే ఈ అమానుష దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించారు. జనసేన అధినేత పవన్ - పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ - మంత్రి కేటీఆర్... ఢిల్లీ జీవీఎల్ తో పాటు అన్ని పార్టీల నేతలంతా ఈ అమానవీయ దాడిని ఖండించేశారు. కానీ ఈ ఖండనే బాబుగారికి నచ్చలేదు..

నా రాష్ట్రంలో జరిగిన దాడిని మీరేలా ఖండిస్తారు.. మీరంతా ఒక్కటే తనపై కక్ష సాధింపులకు ప్రత్యర్థులంతా ఒక్కటయ్యారని బాబు గారు మొసలి కన్నీరు కార్చారు. ఇప్పుడిదే విషయాన్ని తాజాగా లోటస్ పాండ్ లోని ఇంటికి చేరిన జగన్ ను పరామర్శించిన అనంతరం వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తావించారు. చంద్రబాబు ఖండనల పర్వంపై దుమ్మెత్తిపోశారు.

జగన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తే బాబు మాత్రం ఖండించలేదని.. దీన్ని జగన్ కే అంటకడుతూ రాజకీయం చేస్తున్నాడని అంబటి రాంబాబు మండిపడ్డారు. మానవతాదృక్పథంతో ఖండించిన వారినే బెదిరిస్తున్న చంద్రబాబు తీరు దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ - పవన్ - జీవీఎల్ - కేటీఆర్ లు ఈ ఘటనను ఖండిస్తే బాబు ఎందుకు దొంగలా భుజాలు తడుముకుంటున్నాడని ప్రశ్నించారు. అసలు ఖండించడం నేరమా అని ప్రశ్నించారు.

ఇలా వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఖండించని బాబు వైఖరిపై విమర్శలు చెలరేగుతున్నాయి. జగన్ ను పరామర్శించడం కూడా బాబు తప్పుపట్టడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.