Begin typing your search above and press return to search.

యజ్ఞం చేస్తున్న దేవతల్ని అడ్డుకునేలా బాబు బ్యాచ్ దుర్మార్గం

By:  Tupaki Desk   |   27 Sept 2019 11:35 AM IST
యజ్ఞం చేస్తున్న దేవతల్ని అడ్డుకునేలా బాబు బ్యాచ్ దుర్మార్గం
X
జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కోపం వచ్చింది. బాబు అండ్ కో చేస్తున్న విమర్శలు.. ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. బాబు తీరును ఆయన తీవ్రస్థాయిలో దునుమాడారు. బాబు అండ్ కోను రాక్షసులుగా అభివర్ణించిన ఆయన.. తనదైన తరహాలో ఆసక్తికర పోలిక తీసుకొచ్చారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు అడ్డుపడిన తరహాలో జగన్ అవినీతిరహిత పాలన చేస్తుంటే..బాబు అదే పనిగా అడ్డుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బాబు కక్కే విషానికి ఎల్లో మీడియా వంత పాడుతుందన్న ఆయన.. బాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారంటూ ఎల్లో మీడియా మొదటిపేజీలో వార్త రాస్తోందన్నారు. జగన్ చేస్తున్న మంచిపనుల్ని బాబు అడ్డుకుంటున్నారని.. ప్రజల్ని తప్పుదోవ పట్టేటట్లు తండ్రికొడుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

తన పాలనలో వేలాది కోట్ల అవినీతికి పాల్పడిన బాబుకు భిన్నంగా రివర్స్ టెండరింగ్ తో అవినీతిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరికడుతున్నారన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరంలో రూ.780 కోట్ల ప్రజాధనాన్ని జగన్ ఆదా చేశారన్నారు. పీపీఏల పేరుతో వందల కోట్ల రూపాయిల్ని కమిషన్ల పేరుతో బాబు నొక్కేస్తే.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రజాధనాన్ని ఆదా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

మొత్తంగా జగన్ పాలన ప్రజలకు మేలు చేసేలా ఉంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతగా చంద్రబాబు తీరు ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఉందన్న మాటను ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేనా.. రుణమాఫీ పేరుతో బాబు ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపారు.

రూ.87వేల కోట్ల రైతు రుణాల్ని రూ.24వేల కోట్లకు కుదించి.. అందులో రూ.15వేల కోట్లు రుణాలు మాత్రమే బాబు తన హయాంలో మాపీ చేశారని.. నాలుగైదు విడతల్లో రుణమాఫీ నిధులు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి ముఖ్యమంత్రి జగన్ కు ఏం సంబంధం? అంటూ అంబటి ప్రశ్నిస్తున్నారు.