Begin typing your search above and press return to search.

మళ్ళీ జగన్ పాదయాత్ర...మంత్రి ఏమన్నారంటే...?

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:45 PM GMT
మళ్ళీ జగన్ పాదయాత్ర...మంత్రి ఏమన్నారంటే...?
X
ఏపీలో యాత్రల సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర మొదలెట్టేశారు. కుప్పం నుంచి కాళ్ళు కదిపిన లోకేష్ సమరోత్సాహంతో ముందుకే అని దూకుడు చేస్తున్నారు. ఆయన ప్రసంగాలు వాడిగా వేడిగా వైసీపీని గుచ్చుకుంటున్నాయి. లోకేష్ నాలుగు వందల రోజుల పాదయాత్ర ఒక రోజు పూర్తి అయితేనే ఏపీ హీటెక్కింది. ఇక రోజూ ఈ విధంగానే ఉంటుంది అనుకోవాలి.

మరో వైపు చూస్తే వారాహి రధమెక్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. ఆయన డేట్ టైం ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ రావడం అన్నది పక్కా అని చెప్పేస్తున్నారు. తన యువ గళం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండూ ఏపీలో కొనసాగుతాయని లోకేష్ తేల్చి చెప్పేశారు.

ఇలా విపక్షం వీధులలోకి వచ్చాక అధికార పక్షం వైపు నుంచి ఏంటి అన్న చర్చ సహజంగానే ఉంటుంది. వైసీపీకి గతంలో వైఎస్ విజయమ్మ, షర్మిల స్టార్ కాంపెయినియర్లుగా ఉండేవారు. కానీ ఇపుడు జగన్ తప్ప ఎవరూ లేరు. జగన్ చూస్తే సీఎం గా ఉన్నారు. అధికారిక బాధ్యతలతో ఆయన ఉన్నారు.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఆయన పాలన సాగించాలి. అందువల్ల జగన్ ఇప్పట్లో బయటకు పార్టీ కోసం జనాల వద్దకు వచ్చే అవకాశాలు లేవు అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడిన సందర్భంలో జగన్ పాదయాత్ర ఉంటుందా అన్న ప్రశ్న మీడియా వైపు నుంచి వచ్చింది.

దానికి అంబటి రాంబాబు ఎందుకు ఉంటుంది. ఆయన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా చేశారు కదా. ప్రజలకు చెప్పాల్సింది చెప్పాం, అధికారం ఇచ్చారు. చెప్పిన ప్రతీ మాటా నెరవేరుస్తున్నామని బదులిచ్చారు. అయినా ఇపుడు ఎన్నికలు లేవు కదా అని ఎదురు ప్రశ్నించారు జగన్ పాదయాత్ర ఉంటుందా అంటే మాతం పాదయాత్ర అన్నది ఉండదనే అంబటి చెప్పారు.

ప్రజలకు మేము ఏమి చేశామో చెబుతాం, వారే మమ్మల్ని తిరిగి గెలిపిస్తారు. మాకు జనం మీద నమ్మకం ఉంది. నమ్మకం లేని వారే యాత్రలంటూ హడావుడి చేస్తున్నారు అని అంబటి విపక్షాల మీద సెటైర్లు వేశారు. ఎన్నికలు లేకపోయినా జనంలోకి విపక్షం వెళ్తోంది అంటే వారికి భయమే కారణం అని ఆయన అన్నారు. ఒక్కరుగా రాకుండా అంతా కలసి వస్తున్నారు అంటే వైసీపీని చూసి భయమే కదా అని ఆయన లాజిక్ పాయింట్ తీశారు.

జగన్ పాదయాత్ర చేయకపోవచ్చు మరి వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో జనం వద్దకు వస్తారా లేదా అన్నదే ప్రశ్న. అయితే మంత్రి చెప్పిన దానిని బట్టి చూస్తే ఇప్పటికైతే జగన్ జనంలోకి యాత్రల రూపంలో వచ్చేది ఉండదని అంటున్నారు. ఎన్నికలు దగ్గర చేశాక బస్సు యాత్రను పెట్టుకుని మొత్తం జిల్లాలలో జగన్ టూర్లు చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రకు కామెంట్స్ విమర్శలు మాత్రం వైసీపీ నుంచి డైలీ వస్తాయని అంబటి ఒక సంకేతం ఇచ్చారు. మమ్మల్ని విమర్శిస్తే ఊరుకుంటామా జవాబు చెప్పలి కదా చెబుతామని ఆయన అన్నారు. అంటే మీడియా మీటింగులకే వైసీపీ పరిమితం అవుతుంది అని ఆయన చెబుతున్నారు. వైసీపీలో చూస్తే జగన్ మాత్రమే స్టార్ అట్రాక్షన్ గా ఉన్నారు. దాంతో వైసీపీకి ఒక విధంగా విపక్షం చేసే యాత్రలు బయటకు చెబుతున్నంత ఈజీగా తీసివేసేవి కావు అనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.