Begin typing your search above and press return to search.

బాబు సీట్ల క‌ల‌పై..అంబ‌టి సెటైర్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   30 May 2018 9:39 PM IST
బాబు సీట్ల క‌ల‌పై..అంబ‌టి సెటైర్ అదుర్స్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌లి కాలంలో సంద‌ర్భం ఏదైనా ఓ విష‌యం ప్ర‌ధానంగా చెప్తున్న సంగ‌తి చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. బీజేపీతో దోస్తీకి గుడ్‌ బై చెప్పిన అనంత‌రం వేదిక ఏదైన బాబు ప్ర‌ధానంగా చెప్తున్న‌ది....తెలుగుదేశం పార్టీని 25 ఎంపీ సీట్ల‌లో గెలిపించాల‌ని అలా అయితే రాబోయే కాలంలో ఢిల్లీలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే బాబు చేస్తున్న ఈ ప్ర‌క‌ట‌న‌ల‌పై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ నేత అంబ‌టి రాంబాబు భారీ సెటైర్ వేశారు. చంద్ర‌బాబుకు 25 సీట్లు ఇవ్వాల్సిందేన‌ని పేర్కొంటూ అవి ఎంపీ సీట్లు కాదు..ఎమ్మెల్యే సీట్ల‌ని త‌న‌దైన స్టైల్ లో పంచ్ వేశారు.

గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ చేశారని చెప్తున్న చంద్ర‌బాబు...అమ‌లు చేయని వాటికి ప్రతిపక్షం, కొద్దికాలం కింద‌టి మిత్ర‌ప‌క్ష‌మైన‌ బీజేపీ కారణమని పేర్కొనడం దారుణమన్నారు. బీజేపీ, పవన్‌ ఇద్దరూ టీడీపీని వీడిపోవడంతో ఆ పార్టీలో మళ్లీ అధికారంలోకి వస్తామా? లేదా అన్న సందేహంలో ఉన్నారు కాబ‌ట్టే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు తనకు కట్టబెట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గుచేటు అని అంబ‌టి మండిప‌డ్డారు. ఏం చేశావని నీకు అన్నీ స్థానాలు ఇవ్వాలని అంబటి ప్రశ్నించారు. 25 సీట్లు అసెంబ్లీలో వస్తాయని, పార్లమెంట్‌లో మాత్రం కాదని ఎద్దేవా చేశారు. ``ప్రపంచవ్యాప్తంగా వందల దేశాల్లో టీడీపీ మహానాడు జరుపుకుంటారని చంద్రబాబు ప్రకటించిన మరుక్షణమే డల్లాస్‌లో తెలుగు వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతదాకా ఎందుకు..టీడీపీలో పుట్టి, పెరిగిన వ్యక్తి, ఎన్టీఆర్‌తో సహచర్యం చేసిన మోత్కుపల్లినరసింహులు నీ గురించి ఏం మాట్లాడారో విన్నారా చంద్రబాబు? మోత్కుపల్లి మాటలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?ఎన్‌టీ రామారావుకు, తనకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చిందంటే మీ వల్లే అని కార్యకర్తలకు పాదాభివందనాలు చేసిన చంద్రబాబు..వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. మోత్కుపల్లికి పాదాభివందనం చేసి బయటకు పంపించారు`` అని ఆరోపించారు. మహానాడులో ఒక్క నాయకుడు కూడా నిజాలు చెప్పలేదని - జేసీ దివాకర్‌ రెడ్డి మాత్రం మిషన్‌ పనిచేయనప్పుడు చంద్రబాబును విమర్శించారని అంబ‌టి ఎద్దేవా చేశారు. అబద్ధాలు వల్లె వేసే కార్యక్రమంలో టీడీపీ నేతలు మహానాడులో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజిస్తే.. బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి పనిచేసిన టీడీపీని కూడా ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే..ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా మోసం చేసింది మోడీ, చంద్రబాబే అని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ప్రత్యేక హోదా కావాలని మోడీని అడిగారా అని ప్రశ్నించారు. మోడీకి వైయస్‌ జగన్‌ తో సంబంధాలు అంటకట్టడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అయితే, బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. 2014లోనే బీజేపీ త‌మతో పొత్తుకు ప్రయత్నిస్తే తామే ఒప్పుకోలేదని వివ‌రించారు చంద్రబాబు ఓ రాజకీయ కుట్ర చేస్తున్నారని, ఆయన మాటలు వినొద్దని, ఎవరితోనూ వైఎస్‌ఆర్‌సీపీ కలువదని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. ప్రజల మద్దతు ఉంటే చాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు.