Begin typing your search above and press return to search.

వైఎస్ అంత ధైర్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గ‌ల‌వా బాబు?

By:  Tupaki Desk   |   29 April 2018 7:00 AM IST
వైఎస్ అంత ధైర్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గ‌ల‌వా బాబు?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు * ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త‌న పార్టీ - ప‌రిపాల‌న కంటే వైఎస్ ఆర్‌ సీపీపైనే ఎక్కువ దృష్టి ఉంద‌ని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. వైసీపీపై టీడీపీ - ఎల్లోమీడియా వైఎస్ ఆర్‌ సీపీపై దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని, బీజేపీతో వైఎస్ ఆర్‌ సీపీ కలసి పోతుందని విష ప్రచారం చేయడం సరైందని కాదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారని, వైఎస్ఆర్‌సీపీకి ఎవరితో కలవాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ స్వయం ప్రకాశమైన పార్టీ కాదని అంబ‌టి అన్నారు. `ప్రతి ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఎవరితో కలవాల్సిన అలవాటు వైఎస్ఆర్‌సీపీకి లేదు. చంద్రబాబు అసత్య ప్రచారానికి ఎల్లో మీడియా తోడుగా నిలబడి కలిసి పోతున్నారని విష ప్రచారం చేస్తున్నాయి.` అని మండిప‌డ్డారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి వైఎస్‌ జగన్ అని అన్నారు.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు పునాదులు వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మే మాసంలో మండుటెండర్లలో 50 డిగ్రీల ఎండలో పాదయాత్ర చేశారన్నారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారని, ఆయన ఉదయం మార్నింగ్‌ వాక్‌ మాదిరిగా చేశారని, ఎన్ని ట్యాంకుల నీళ్లు పోశారో అని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాదయాత్రలో కూడా చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల కష్టాలు చూసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి - సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చంద్రబాబు అలాంటి పథకాలు ఒక్కటైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తరువాత ఏ ఒక్క వాగ్ధానం చేయకుండా 2009లో ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

వ్యక్తిగతమైన పరిచయాలతో మోడీ కాళ్లపై పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబ‌టి ఆరోపించారు. టీటీడీ పాలక మండలిలో సుదీర్‌ ముంగిటివార్‌ అనే మంత్రి భార్యను బోర్డు మెంబర్‌గా నియమించడం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రులతో ఎందుకు రహస్య మంతనాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. పైకి ఘింకరిస్తారు..లోపలేమో కాళ్లు పట్టుకునే స్వభావం చంద్రబాబుదేన‌ని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తుపొట్టుకొని వేలాడిన చంద్రాబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో టీడీపీ, బీజేపీ రెండూ ముద్దాయిలే అని అన్నారు. చేసిన పాపం బీజేపీపై నెట్టేయడానికే చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారంటూ విమర్శించారు.

కర్ణాటక ఎన్నికల తరువాత పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అంబ‌టి అన్నారు. గవర్నర్‌తో కలిసి వెంటనే చంద్రబాబు స్వరం మారుతుందన్నారు. మాజీ సీఎస్‌ లు ఐవైఆర్‌ కృష్ణారావు - అజయ్‌ కల్లాం ఇద్దరూ కూడా చంద్రబాబు వద్ద పని చేశారని - వీరిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. వారిద్దరు ఇటీవల రెండు పుస్తకాలు రాశారని - అందులో చంద్రబాబు దుష్ట పరిపాలన గురించి ప్రస్తావించారన్నారు. వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. దోపిడీలు చేసే ఆయ‌న‌కు ప్రజల మద్దతు ఉండదని, గుణపాఠం చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.