Begin typing your search above and press return to search.

బాబు ఐదేళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటమా అంబటి?

By:  Tupaki Desk   |   24 Jan 2022 4:49 AM GMT
బాబు ఐదేళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటమా అంబటి?
X
సమాధానాలు చెప్పేందుకు తల్లడిల్లిపోవాలి. అంతేకానీ.. డొల్లతనం బయటపడకూడదు. అప్పుడేం చేయకుండా.. ఇప్పుడు అన్నేసి మాటలు అనేయటమా? అని ఎదురు ప్రశ్నలు సంధించే పరిస్థితిని తెచ్చుకోకూడదు. మరేం అయ్యిందో కానీ.. మంచి మాటకారి అయిన అంబటి..మంత్రి కొడాలి నాని తరఫున వకల్తా పుచ్చుకొని మీడియా ముందుకు వచ్చి..నాన్ స్టాప్ గా తన వాదనను వినిపించే క్రమంలో అడ్డంగా బుక్ అయిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.

గుడివాడలో గోవా కల్చర్ అంటూ పచ్చ మీడియా అండ్ టీడీపీ నేతలు చేస్తున్న రచ్చపై విరుచుకుపడేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించిన అంశాలు అంబటి వైపు వేలెత్తి చూపించేలా ఉండటం గమనార్హం. తమ బాస్ కమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్లబ్బులపై ఉక్కుపాదం మోపినట్లుగా గుర్తు చేసిన అంబటి.. పనిలో పనిగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో క్లబ్బులు 365 రోజులు సాగాయని.. టీడీపీకి చెందిన మాగంటి బాబు పేకాట క్లబ్బులు నడపలేదా? అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా అంబటి మెమరీకి మెచ్చుకోవాల్సిందే. అయితే.. ఆయన మిస్ అయిన పాయింట్ ఏమంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న వేళ.. ఇష్టారాజ్యంగా.. ఏడాదిలోని 365 రోజులు క్లబ్బులు అదే పనిగా నడిపినప్పుడు.. దాన్ని అడ్డుకొని ప్రశ్నించాల్సిన నాటి ప్రతిపక్షంలో ఉన్న అంబటి అండ్ కోలు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నిలదీయలేదు? ప్రభుత్వ తీరును ఎందుకు తప్పు పట్టలేదు? అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఓ పక్క గుడివాడలో గోవా కల్చర్ ను తీసుకొచ్చారంటూ.. వీడియోలు బయటకు వచ్చేసిన తర్వాత.. దాని మీద మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడిన ఇన్ని రోజులకు.. అంబటి వారు ప్రెస్ మీట్ పెట్టటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి మూడురోజులు అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా మీడియా వదలటం లేదంటూ గుస్సా అయిన అంబటి.. మీడియా.. టీడీపీ నేతలు వదల్లేదు సరే.. మరి ఆయన ఇప్పుడు చేస్తున్నదేమిటి? అన్న రివర్సు క్వశ్చన్ కు ఏమని బదులిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. కొన్నిఅంశాల మీద మాట్లాడే కన్నా మౌనంగా ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో లోతుత్లోకి వెళ్లే కొద్దీ.. గోతుల్లోకి దిగబడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ విషయం మంచి మాటకారి అయిన అంబటి వారికి అర్థం కాకపోవటం ఏమిటి? ఎందుకలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటారు?