Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్ డిమాండ్..మంత్రిని చేస్తానంటేనే పోటీ

By:  Tupaki Desk   |   20 April 2018 3:23 AM GMT
రెబ‌ల్ స్టార్ డిమాండ్..మంత్రిని చేస్తానంటేనే పోటీ
X
క‌న్న‌డ రాష్ట్ర రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ ఓ వైపు స‌మీపిస్తుంటే...మ‌రోవైపు పార్టీ నేత‌ల డిమాండ్లు - ప్ర‌క‌ట‌న‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా రెబెల్ స్టార్ అంబ‌రీష్ సంచ‌ల‌న డిమాండ్ ఒక‌టి పెట్టారు. ఎన్నికలకు ముందే మండ్య కాంగ్రెస్‌ అభ్యర్థి అంబరీష్‌ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. టికెట్‌ ప్రకటించినా ‘బీ ఫారం’ అందుకోని ఆయన షరతులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీ ఫారం తీసుకోవాలంటే మండ్య జిల్లా ఎన్నికల ఇన్‌ చార్జి బాధ్యతలను అప్పగించాలని - పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలనే షరతులు విధిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా విష‌యంలో కర్ణాటకకు చెందిన పలువురి కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్‌ కు టికెట్ కేటాయించారు. అయితే అంబరీష్ కు టిక్కెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తూ అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ర‌వి గ‌ణిగ అనే పార్టీ నేత అనుచ‌రులు విధ్వంసం సృష్టించారు. అంబ‌రీష్‌కు టికెట్ కేటాయించ‌డాన్ని మండ్య పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోకి చోరబడిన కార్యకర్తలు ఫర్నీచర్ - కంప్యూటర్లు ద్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. రవి గణిగకు టిక్కెట్ కేటాయించాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.2013 శాసన సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి రెబల్ స్టార్ అంబరీష్ - రవి గణిగ ఇద్దరూ పోటీ చెయ్యడానికి ప్రయత్నించారని ఆ సమయంలో ఈ శాసనసభ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని చెప్పారని, అందుకే అప్పట్లో తాను పోటీ నుంచి తప్పుకున్నానని, అంబరీష్ ఇప్పుడు మళ్లీ టిక్కెట్ సంపాధించుకున్నారని సోమవారం మీడియా ముందు రవి గణిగ ఆరోపించారు.

ఓ వైపు నాయ‌కుల నిర‌స‌న‌లు ఇలా ఉంటే మ‌రోవైపు అంబ‌రిష్ త‌న డిమాండ్‌లు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. సీఎం సిద్ధారామయ్య సూచనతో బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కేజే జార్జ్‌ బుధవారం అంబరీష్‌ను కలిసి బీఫారం తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. శుక్రవారం(ఏప్రిల్-20) రాష్ట్ర ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ అంబరీష్‌ను కలిసి చర్చలు జరుపనున్నారు. అంబరీష్‌ డిమాండ్లను ఆమోదిస్తారో లేదో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా అంబరీష్‌ ఇంటికి బీ ఫారం పంపుతామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ జీ పరమేశ్వర్‌ తెలిపారు. మరోవైపు నాయకులు, కార్యకర్తలు అంబరీష్‌ను కలిసి నియోజకవర్గానికి రావాలని… మీ వెంట మేం ఉంటామని, నామినేషన్‌ దాఖలు చేయాలని ఒత్తిడి చేశారు. ఈ ప‌రిణామంపై అధికార కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.