Begin typing your search above and press return to search.

5జీ టెక్నాలజీని అనుమతించాలంటూ కేంద్రాన్ని కోరిన అంబానీ !

By:  Tupaki Desk   |   8 Dec 2020 5:00 PM IST
5జీ టెక్నాలజీని అనుమతించాలంటూ కేంద్రాన్ని కోరిన అంబానీ !
X
దేశంలో 5జీ టెక్నాలజీని త్వరితగతిన అనుమతించమంటూ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. ఇందుకు వీలుగా పాలసీ నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరారు. దేశంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ జోరందుకునేందుకు పలు సూచనలను చేశారు. మూడు రోజుల భారత్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు 2020 ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్‌ వద్ద డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పలు అంశాలను ప్రస్తావించారు.

2021 ... ద్వితీయార్థానికల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసి ఉంది. ఇదేవిధంగా అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ ఫోన్లను అందించేందుకు వీలు కల్పించవలసి ఉంది. ఇందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్రధాని మోడీజీ డిజిటల్‌ మిషన్‌ కారణంగా కరోనా వల్ల ఎదురైన కష్టకాలంలోనూ దేశం బలంగా నెగ్గుకురాగలిగింది. ఆన్‌ లైన్‌ లోనే విద్య, షాపింగ్‌, ఆఫీసులు, ఆరోగ్యం తదితర పలు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందుకు దేశమంతటా విస్తరించిన 4జీ నెట్‌ వర్క్‌ మౌలిక సదుపాయాలు సహకరించాయి.

అయితే ఇప్పటికీ 30 కోట్లమంది ప్రజలు 2జీ నెట్ ‌వర్క్ ‌కే పరిమితమై ఉన్నారు. చౌక ధరల్లో స్మార్ట్ ‌ఫోన్లకు తెరతీయడం ద్వారా మరింతమంది ప్రజలకు డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ సహకారం కారణంగా టెలికం పరిశ్రమ పలు సర్వీసులను అందించగలిగింది. త్వరలో చౌక ధరలోనే వ్యాక్సిన్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నందున 2021లో పరిస్థితులు చక్కబడతాయని విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ సైతం డిజిటల్‌ కనె క్టెడ్‌ దేశాల జాబితాలో ముందుంటోంది. దీనిని కొనసాగిస్తూ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన 5జీ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు.. అందుబాటు ధరలో సర్వీసులు, స్మార్ట్‌ ఫోన్లకు అవకాశం కల్పించవలసి ఉంది. తద్వారా 2021 ద్వితీయార్థానికల్లా రిలయన్స్‌ జియో ద్వారా 5జీ విప్లవానికి బాటలు వేయగలం. దీంతో దేశీయంగా 5జీ నెట్ ‌వర్క్‌, హార్డ్‌ వేర్‌, టెక్నాలజీ పరికరాల తయారీకి ఊపు లభిస్తుంది. ప్రధాని మోడీజీ ఆవిష్కరించిన ఆర్మనిర్భర్‌ భారత్‌ విజన్‌ లో జియో 5జీ సర్వీసులు భాగంకావడం ద్వారా డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కు ఊపు నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.