Begin typing your search above and press return to search.

టాటా, బిర్లా మధ్యలో అంబానీ!

By:  Tupaki Desk   |   17 Nov 2022 1:30 PM GMT
టాటా, బిర్లా మధ్యలో అంబానీ!
X
ఒక కంపెనీని దక్కించుకోవడం కోసం అపర కుబేరులు టాటా, బిర్లా, ముకేష్‌ అంబానీ పోటీ పడుతుండటం ఆసక్తి రేపుతోంది. అంతగా ఈ అపర కుబేరులను ఆకట్టుకున్న కంపెనీ టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌.

టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌ మహిళల దుస్తులను తయారుచేస్తోంది. దీని ఆధ్వర్యంలో డబ్ల్యూ, అరేలియా, విష్‌ఫుల్, ఎలెవన్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయి. మహిళల దుస్తులకు సంబంధించి టీసీఎన్‌ఎస్‌కు మంచి పేరుంది.

ప్రస్తుతం కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కట్టిపెట్టి మళ్లీ ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. దీంతో మళ్లీ మంచి దుస్తులకు డిమాండ్‌ పెరిగింది.

దీంతో రిటైల్‌ రంగంలో ఉన్న ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్, బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, టాటాలకు చెందిన ట్రెంట్‌ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

మరోవైపు టీసీఎస్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌లో టీఏ అసోసియేట్స్‌కు 29.24 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ ఈ వాటాను అమ్మాలనుకుంటోంది. దీంతో దాన్ని దక్కించుకోవడానికి రిలయన్స్‌ రిటైల్, ట్రెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, నైకాతో సహా అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి.

టాటా, బిర్లా, అంబానీలే కాకుండా టీపీజీ క్యాపిటల్, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ వంటి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా రంగంలో ఉన్నాయి.

కాగా టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌లో డబ్ల్యూ 52%, అరేలియా 41% కలిగి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.350.5 కోట్లగా నమోదైంది. అలాగే లాభం రూ.7.6 కోట్లుగా ఉంది.
టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీఏ అసోసియేట్స్‌ వాటా విలువ దాదాపు రూ.1,000 కోట్లుగా ఉంది.

కాగా ఒక పెట్టుబడిదారుడు కంపెనీలో టీఏ అసోసియేట్స్‌ మొత్తం వాటాను కొనుగోలు చేస్తే.. వారు 26 శాతం వరకు పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందుకే బడా కంపెనీలు దీన్ని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు బడా సంస్థలు పోటీ పడుతున్నాయనే వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్ల ధర భారీగా పెరగడం విశేషం. నవంబర్‌ 16న ఒక్కరోజే 7.87 శాతం పెరిగి ప్రస్తుతం ఒక్కో షేరు రూ.602.05 వద్ద ట్రేడ్‌ అవుతుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.