Begin typing your search above and press return to search.

కార్యాలయంలో అమెజాన్ ఉద్యోగి రచ్చరచ్చ: కారు లోపలికి తీసుకెళ్లి హల్ చల్

By:  Tupaki Desk   |   15 July 2020 1:30 PM IST
కార్యాలయంలో అమెజాన్ ఉద్యోగి రచ్చరచ్చ: కారు లోపలికి తీసుకెళ్లి హల్ చల్
X
సంస్థపై కోపంతో ఓ ఉద్యోగి హల్ చల్ చేశాడు. ఎందుకు కోపం వచ్చిందో ఏమో తెలియదు గానీ కార్యాలయం లోపలకు వెళ్లి రచ్చరచ్చ చేశాడు. ఏకంగా ఆఫీసులోకి కారు తీసుకెళ్లి విధ్వంసం సృష్టించాడు. అతడి చర్యతో దాదాపు 60 వేల డాల‌ర్ల భారీ నష్టం సంభవించింది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కోల‌రాడోలో చోటుచేసుకుంది.

స్టీవెన్ కోహెన్ అనే వ్యక్తి అమెజాన్ కేంద్రంలో పని చేస్తున్నాడు. ఈ సమయంలో కార్యాలయంలోకి ఒక్కసారిగా కారుతో దూసుకెళ్లాడు. ముందుగా కార్యాలయ భవనం ముందువైపు ఉన్న తలుపులు ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కార్యాలయం వెనుక వైపుకు కారు తీసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. అక్కడ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. అతడు రచ్చరచ్చ చేసి సంస్థకు దాదాపు 60 వేల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

కోలరాడో రాష్ట్రంలోని థార్న్టర్న్ మున్సిపాలిటీలోని అమెజాన్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంపెనీ అధికారుల ఫిర్యాదుతో ఆ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు హటాత్తుగా రెచ్చిపోవడంతో అక్కడి ఉద్యోగులు షాకయ్యారు. ఆ ఘటనకు ముందు అతడు ఎటువంటి వాగ్వివాదానికీ దిగలేదు. ఈ ఘటన రాత్రి 9.30 గంటల సమయంలో జరగడంతో కొంత ప్రాణాపాయం తప్పింది. స్టీవెన్ కోహెన్ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఏమిటో తెలియడం లేదు. అయితే అతడి మానసిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.