Begin typing your search above and press return to search.

పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా?

By:  Tupaki Desk   |   18 Sep 2021 6:58 AM GMT
పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా?
X
పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన అసంతృప్తి జ్వాల ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ రాజీనామాకు కారణమైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కొద్దిరోజులుగా పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అమరీందర్ సింగ్ ను పక్కనపెట్టి క్రికెటర్, నేత నవజ్యోత్ సింగ్ సిద్దూను పీసీసీ చీఫ్ చేసి అన్ని బాధ్యతలను అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం అమరీందర్ వ్యతిరేకిస్తున్నా వినిపించుకోలేదు. దీంతో అమరీందర్, సిద్దూ మధ్య రోజురోజుకు వివాదం ముదిరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎంగా కొనసాగనని అమరీందర్ చెప్పినట్లు తెలిసింది.

తాజాగా ఈరోజు చండీగఢ్ లో జరిగే సీఎల్పీ భేటికి ముందే అమరీందర్ సింగ్ తన రాజీనామాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను సాయంత్రం గవర్నర్ కు పంపించనున్నారని సమాచారం.

ఇక సాయంత్రం సీఎల్పీ భేటిలో కొత్త నేతను ఎన్నుకోనున్నారట.. ప్రస్తుతం అమరీందర్ వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సిద్దూ సీఎం అవుతాడా? లేక మరో నేతను ఎన్నుకుంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

సీఎం అమరీందర్ ను వ్యతిరేకించి బయటకొచ్చిన క్రికెటర్ , మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వచ్చారు. సీఎం అమరీందర్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ రాగా.. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ మొదట ఇవ్వలేదట.. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలిగి సీఎం అమరీందర్ సింగ్ పై తిరుగుబాటు ఎగురవేసిన ప్రముఖ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించి పీసీసీ చీఫ్ ను చేసింది.

సిద్దూ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు ముగిసిందనిపిస్తోంది. రాష్ట్ర సీఎంగా అమరీందర్ సింగ్ కొనసాగుతారని.. ప్రముఖ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమించి కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరినీ రాజీ చేసినట్టైంది. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టే అనుకున్నారు. అమరీందర్ కు సీఎం పోస్టు.. సిద్దూకు పీసీసీ చీఫ్ పోస్టు తీసుకోవడానికి ఇద్దరూ అంగీకరించారు.. సిద్దూకు ఒక పదవిని ఇస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక వీరితోపాటు హిందూ, దళిత వర్గాల నుంచి ఇద్దరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ముగిసినట్టేనని పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి హరీష్ రావత్ తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సీఎం అమరీందర్ సింగ్ కట్టుబడి ఉంటారని చెబుతున్నారు. త్వరలోనే జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్, సిద్దూ ఇద్దరూ కలిసి పనిచేస్తారని అంటున్నారు. కానీ విభేదాలు పొడచూపి ప్రస్తుతం అమరీందర్ సింగ్ సీఎంగా రాజీనామా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

త్వరలోనే పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీకి ఆశలు లేకున్నా.. కాంగ్రెస్ లోని అనైక్యత చేటు తెస్తోంది. ఈ క్రమంలోనే సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి లేవదీశారు. అమరీంద్ సింగ్ సైతం ఇప్పుడు రాజీనామా చేసి మరింత రాజేశారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్నది వేచిచూడాలి.