Begin typing your search above and press return to search.

మోడీ చాయ్ ని ఆయన ‘కాఫీ’ కొట్టేశాడు

By:  Tupaki Desk   |   5 April 2016 7:35 AM GMT
మోడీ చాయ్ ని ఆయన ‘కాఫీ’ కొట్టేశాడు
X
మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ తాను చాయ్ వాలానని చెబుతూ.. చాయ్ పే చర్చ కార్యక్రమాలు చేపడుతూ చేసుకున్న ప్రచారం ఎలాంటి అద్భుత ఫలితాన్నిచ్చిందో తెలిసిందే. తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ టీకి ప్రసిద్ధి చెందిన అస్సాంలో మోడీ మళ్లీ చాయ్ మంత్రమే అందుకున్నారు. అక్కడ అతి పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు బీజేపీకే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఆ లెక్కన మోడీ చాయ్ ఫార్ములా మరోసారి హిట్టవుతుందనే అనుకోవాలి. అయితే... మోడీ చాయ్ పంచుతుంటే.. పంజాబ్ లో కాంగ్రెస్ నేత - మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా మోడీ ఫార్ములాపై మోజు పడ్డారు. మోజు పడడంతో ఆగకుండా ఆయన ఫార్ములాను కాపీ కొడుతూ కాఫీ ఫార్ములా తీసుకొచ్చారు. కాఫీ విత్ కెప్టెన్ అంటూ ప్రచారానికి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం ఉన్నా కూడా ఇప్పటి నుంచే కాఫీ గ్లాసులతో చీర్సు చెబుతున్నారు.

లస్సీకి ప్రసిద్ధమైనా పంజాబ్ లో పదేళ్ళుగా అధికారం దరిదాపుల్లోకి కూడా రాకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ యువ వోటర్లను ఆకట్టుకోవడానికి కాఫీని నమ్ముకుంది. లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ సాగించిన ఛాయ్ పే చర్చ తరహలో పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ కాఫీ విత్ కెప్టెన్ అనే కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ‘‘కాలం మారింది. మన గ్రామీణ ప్రజల్లో ఎక్కువ మంది ప్రవాస భారతీయులే. వాళ్లు కాఫీ తాగుతారు, ఇక్కడ వున్నప్పుడు బంధువులకి కాఫీ ఇస్తారు. ప్రపంచం కుగ్రామమైపోయింది’’. అంటూ తన తన వినూత్న కార్యక్రమానికి సమర్ధనగా అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ శాసనసభకు త్రిముఖ పోటీ జరగవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో , యువత లో మంచి ఆదరణ వున్న అమ్ ఆద్మీ పార్టీకి దీటుగా , యువతరాన్ని ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీనికి కాలేజీ విద్యార్ధుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది.

ఇటివల యువతతో నిర్వహించిన కాఫీ విత్ కెప్టెన్ లో అమరీందర్ మాట్లాడుతూ నాయకునిగా తనకున్న అనుభవం గురించి ప్రధానంగా వివరించారు. నేను చెడ్డవాడ్ననుకుంటే, నాకు వోటెయ్యొద్దు. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ చెడ్డ అనుకుంటే, ఆయనక్కూడా వోటెయ్యకండి. అరవింద్ కేజ్రీవాల్ మంచి మనిషి అనుకుంటే ఆయనకి వోటెయ్యండి. మీలో చాలా మంది ఈసారి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యొచ్చు. పంజాబ్ పరిస్ధితి దిగజారితే ఇబ్బంది పడేది మీరే. నేనుండోచ్చు. ఉండక రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది అని యువతను ఆయన హెచ్చరించారు.

కాగా, యువతనించి ఆయనకు ఇబ్బందికరమైన ప్రశ్నలు సైతం ఎదురయ్యయి. లోక్ సభకూ, శాసనసభకూ గైర్హాజరవుతారనీ, నియోజకవర్గానికి రారనీ ఆయనపై వున్న ఆరోపణల గురించి ప్రస్తావించగా పోరాటాన్నీ, ఆపరేషన్ బ్లూస్టార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూ, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజానామా చేసిన సందర్భాన్నీ వివరించారు. మొత్తానికి గతం ఎలా ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో ఇలా కాపీ కొట్టిన కాఫీ ఫార్ములాతో గట్టెక్కాలని ఆయన చాలా ట్రై చేస్తున్నారు.