Begin typing your search above and press return to search.

ఇలాంటి భజనలే పార్టీని ముంచుతున్నాయ్!

By:  Tupaki Desk   |   3 Oct 2017 3:30 PM GMT
ఇలాంటి భజనలే పార్టీని ముంచుతున్నాయ్!
X
కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యక్తి పూజకు పరాకాష్ట. అచ్చంగా సోనియా కుటుంబానికి భజన చేసుకుంటూ ఉంటే చాలు.. ఇక పార్టీలో ఏం పనీ చేయకపోయినా.. తమ పదవులకు - రాజకీయ భవిష్యత్తుకు- అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదనే సత్యాన్ని గ్రహించి ఆమేరకు నడుచుకునే నాయకాగ్రగణ్యులు మనకు చాలామందే కనిపిస్తూ ఉంటారు. సోనియా - ఆమె కుమారుడు రాహుల్ ల మీద ఈగ వాలనివ్వకపోవడం మాత్రమే కాదు.. వారిద్దరినీ ఆకాశానికెత్తేస్తూ భజన చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి భజనలు పార్టీని సాంతం ముంచుతున్నాయనే సంగతి మాత్రం వారు గుర్తించరు. సదరు నాయకులు కూడా.. తమ స్థాయి - వాస్తవాలను విస్మరించి.. ఈ భజనల మోజులో పడిపోవడం, ఆ పొగడ్తలనే నిజాలుగా భావించడం.. వల్లనే ఒక ఊహా ప్రపంచంలో బతికేస్తున్నారని వాదించేవారూ అదే పార్టీలో ఉండడం విశేషం.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తాజాగా మళ్లీ అదే భజనల సంస్కృతి పురి విప్పుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ ఒక్కడే దీటైన ప్రత్యర్థి అని.. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టవలసిన సమయం కూడా వచ్చేసిందని.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అంటున్నారు. తాను ఎటూ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయిపోయాడు గనుక.. ఇక పార్టీ ఎలాంటి ఊహల ఊబిలో పడిపోయిన తనకు నష్టం ఏముందని అనుకున్నారో ఏమో గానీ అమరీందర్ సింగ్ రాహుల్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మోడీకి దీటుగా అధికారంలోకి తీసుకువచ్చేలా కాంగ్రెస్ పార్టీని నడపగల సామర్థ్యం రాహుల్ కు మాత్రమే ఉన్నదట. ఆయన ద్వారా మాత్రమే.. పార్టీకి పూర్వవైభవం వస్తుందిట. ఎవరినైనా సవాల్ చేయగల శక్తి రాహుల్ కు మాత్రమే ఉన్నదిట. కేవలం కాంగ్రెస్ ను మాత్రమే కాదు.. 2019 ఎన్నికల్లో యావత్ ప్రతిపక్ష పార్టీలను నడిపించగల సత్తా కూడా రాహుల్ కు ఉన్నదిట... కాలిఫోర్నియాలో కూడా రాహుల్ అద్భుతంగా మాట్లాడి మెప్పించారుట... ఇలా సాగిపోతున్నది అమరీందర్ భజన.

ఎవరైనా ఈ మాటలు వింటే.. అమరీందర్ వెటకారం చేస్తున్నారా లేదా నిజంగానే పొగుడుతున్నారా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. కాలిఫోర్నియా ప్రసంగం కూడా రాహుల్ తెలివేతటలను ఎంత నవ్వుల పాలు చేసిందో అందరికీ తెలుసు. అలాంటిది అద్భుతం అంటూ అమరీందర్ పొగుడుతోంటే.. వెటకారం అనే సందేహం పుట్టకుండా ఉంటుందా? అయితే.. విశ్లేషకులు మాత్రం... ఇలాంటి పొగడ్తలే కాంగ్రెస్ పతనానికి పునాది అవుతున్నాయని అంటున్నారు. మరి పార్టీ పెద్దలు ఆ సత్యాన్ని గ్రహిస్తారో.. లేదా భజనల మాయలోనే సమయం గడిపేస్తారో చూడాలి.