Begin typing your search above and press return to search.

అమరావతి గ్రాఫిక్స్ మాయాజాలం.. ఈ మాట ఎంత తప్పు అంటే?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:38 AM GMT
అమరావతి గ్రాఫిక్స్ మాయాజాలం.. ఈ మాట ఎంత తప్పు అంటే?
X
ఏపీ రాజధాని అమరావతి మొత్తం గ్రాఫిక్స్ మాయాజాలమన్న మాట తరచూ వైసీపీ నేతల నోటి నుంచి వస్తూ ఉంటుంది. గ్రాఫిక్స్ తో చంద్రబాబు మాయ చేశారంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడటం తెలిసిందే. నిజానికి 2019 ఎన్నికల ప్రచారంలోనే అమరావతిపై కక్కిన విష ప్రచారం కూడా బాబును భారీగా డ్యామేజ్ చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అంతదాకా ఎందుకు.. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిందేమిటి? బయట జరిగిన ప్రచారం ఏమిటి? అన్న దానికి సంబంధించిన విషయాన్ని చూసేందుకు అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటించే వారు నోరెళ్లబెట్టే పరిస్థితి.

తన పాలనలో పోలవరం.. అమరావతిలను ప్రయార్టీ గా తీసుకొని పనుల్ని పరుగులు తీయించిన చంద్రబాబు.. ఒక పెద్ద తప్పు చేశారని చెబుతుంటారు. నిజానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం బస్సులు పెట్టి గ్రామాల నుంచి కూడా తీసుకెళ్లిన వైనాన్ని గుర్తు చేస్తూ.. దానికి బదులుగా అమరావతి ప్రాంతాలకు పంపి ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత బాగా పని చేసిందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా తెలిసేందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే సీనియర్ జర్నలిస్టు కందుల రమేశ్ తాజాగా రాసిన సంచలన పుస్తకం "అమరావతి"లో బోలెడన్ని కఠిన వాస్తవాల్ని రాసుకొచ్చారు. చేదు నిజాల్ని ప్రస్తావించారు. జరిగిన దుర్మార్గమైన ప్రచారానికి వాస్తవానికి మధ్య ఏ మాత్రం పొంతన లేదని చెప్పుకొచ్చారు. అందుకు గణాంకాలతో పాటు.. నిజాల్ని కళ్ల ముందు కదలాడేలా రాసుకొచ్చారు. అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటూ చేసిన వాదనలో పస ఎంత? నస ఎంత? అన్న విషయాన్ని ఆయన వివరంగా చెప్పుకొచ్చారు.

ఈ అంశంపై ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చిన వివరాల్ని ఆయన మాటల్లోనే చెప్పుకొస్తే.. "వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి అమరావతిలో 2.1 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టటమే కాకుండా అందులో 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని మూడేళ్లలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. అడ్డంకులు.. ఆర్థిక పరిమితులు.. పర్యావరణ నిబంధనలకు లోబడి ఇంత తక్కువ కాలంలో ఇన్ని భారీ నిర్మాణాలు చేపట్టటం ఇటీవల కాలంలో లేదు. భూసమీకరణ.. వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు.. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన.. వివిధ ఆర్థిక సంస్థలతో రుణ ఒప్పందాలు.. ఐకానిక్ భవనాల డిజైన్లకు తుది మెరుగులు.. వందకు పైగా ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థల్ని అమరావతికి రప్పించటానికిఒప్పందాలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. అఖిల భారత సర్వీసుల అధికారుల నివాస భవనాల నిర్మాణం లాంటివెన్నో జరిగాయి" అని పేర్కొంటూ పలు వాస్తవాల్నిఆయన తన అక్షరాలతో చెప్పుకొచ్చారు.

అమరావతికి తూట్లు పొడిచేలా తెర మీదకు వచ్చిన వాదనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో మరొకటి అమరావతిలో అవినీతి జరిగిన కారణంగానే ప్రపంచ బ్యాంకు వైదొలిగిందన్న వాదనలో నిజం ఎంత? అసలు అదో వివాదమా? అన్న ప్రశ్న కూడా పలువురు ప్రస్తావిస్తుంటారు. అయితే.. ప్రపంచ బ్యాంకును వెళ్లిపోయింది చంద్రబాబు ప్రభుత్వ అవినీతితో కాదు.. ప్రపంచ బ్యాంకు భారీగా రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వేళలో.. జగన్ ప్రభుత్వమే ఆ సంస్థను అమరావతి నుంచి వెళ్లిపోయేలా చేసినందన్న వాదన అమరావతి పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ అంశంపై ఆయన ఏమన్నారన్నది చూస్తే.. "అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.4923 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. అమరావతికి ఆర్థిక సాయం అందకుండా.. ఆ ప్రాంతంలోని ఒకరిద్దరు భూకామందులతోపాటు.. వైసీపీ మద్దతుదారులు ప్రయత్నించారు. ఎన్జీవోలు.. పర్యావరణ పరిరక్షకుల పేరుతో.. పేదలకు జీవించే హక్కు పేరుతో ప్రపంచ బ్యాంకుకు ఊపిరాడకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంపై మీ వైఖరిఏమిటో చెప్పాలని కేంద్రం లేఖ రాస్తే.. రాష్ట్రం నుంచి స్పందన లేకపోవటంతో ప్రపంచ బ్యాంకు ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసింది’ అని పేర్కొనటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.