Begin typing your search above and press return to search.

ముగిసిన న్యాయ స్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర

By:  Tupaki Desk   |   14 Dec 2021 11:31 AM GMT
ముగిసిన న్యాయ స్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర
X
ఏడాదిపైగా నిరసనలు కొనసాగించి.. తమ ఆవేదనను ప్రభుత్వానికి వెల్లడించి.. చివరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ తిరుపతికి పాదయాత్ర చేపట్టిన అమరావతి రైతులు ఎట్టకేలకు తమ గమ్య స్థానం చేరుకున్నారు. మంగళవారంతో వారి పాదయాత్ర ముగిసింది. అలిపిరికి చేరుకున్న అమరావతి రైతులు.. కొబ్బరికాయలు కొట్టి యాత్రను ముగించారు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని కొబ్బరి కాయలు కాట్టి శ్రీవారిని వేడుకున్నారు.

45 రోజులు పాదయాత్ర

మూడు రాజధానులు వద్దని.. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఈ మహా పాదయాత్రను మొదలుపెట్టారు. అంతకుముందు రాజధాని రైతులు, మహిళలు భారీ ఎత్తున ఉద్యమం చేపట్టారు. కాగా, వీరి పాదయాత్ర నవంబరు 1న తుళ్లూరు లో మొదలైంది. మొత్తం 45 రోజల పాటు సాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అంటే రోజుకు దాదాపు వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. మరోవైపు కేవలం 500 మందికి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. బుధ, గురువారాల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు. ఈ నెల 17న అమరావతి ఆకాంక్షను చాటేలా బహిరంగ సభ నిర్వహించన్నారు.

సభలో సంచలనాలుంటాయా?

అమరావతి రైతుల పాదయాత్రకు తొలు మిశ్రమ స్పందన దక్కింది. ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా.. న్యాయ స్థానం అనుమతితో పాదయాత్ర ప్రారంభమైంది. కాబట్టి అధికార వైసీపీ ఎలాగూ మద్దతు ఇవ్వదు. అమరావతి.. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం మానస పుత్రిక. కాబట్టి ఆ పార్టీ మద్దతు గట్టిగానే ఉంటుంది. అయితే, ఇక్కడ అసలు మద్దతు ప్రకటించాల్సిన బీజేపీ మిన్నకుండిపోయింది. ఏ మార్గంలో వెళ్లాలో తెలియక కొన్నాళ్లు కొట్టుమిట్టాడింది.

కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. సాక్షాత్తు ప్రధాని మోదీ పునాది రాయి వేసిన అమరావతిపై ఆ పార్టీ నేతలే మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చి తలంటు పోయడంతో ఏపీ బీజేపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రు మద్దతు ప్రకటించారు.

మరో కీలక పార్టీ జనసేన అమరావతి రైతులకు మొదట నుంచి అండగా ఉంటోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగానే అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతుల పాదయాత్ర ముగిసి బహిరంగ సభ వరకు వచ్చింది. శుక్రవారం నిర్వహించే బహిరంగ సభలో ఏమేం జరుగుతాయో చూడాలి.?