Begin typing your search above and press return to search.

బాబు మాయలో అమరావతి రైతులు.. చివరికేం మిగలనుంది.?

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:30 PM GMT
బాబు మాయలో అమరావతి రైతులు.. చివరికేం మిగలనుంది.?
X
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ అధినేత చంద్రబాబు సినిమా యాక్టర్లను మించిన డ్రామాలకు తెరలేపుతున్నారన్న చర్చ సాగుతోంది.. ఐదేళ్ల టీడీపీ హయాంలో ప్రజలకు చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువ చేేసుకున్నారన్న అపవాదు ఉంది. అధికారం కోల్పోయాక మాత్రం ప్రజల వెంట ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని బాబుగారిపై ఆరోపణలున్నాయి.. ప్రజాయాత్ర పేరిట డ్రామా యాత్ర చేపట్టిన బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్.. లండన్.. చేస్తానంటూ ప్రగల్భాలు పలికారే తప్ప చేసిందేమీ లేదంటున్నారు. ఏపీని సింగపూర్ కాదు కాదా? కనీసం ఐదేళ్లలో రాజధానిని కూడా నిర్మించలేదని ఎద్దేవా చేస్తున్నారు.. ఏపీ ప్రజలకు ‘బహుబలి’ గ్రాఫిక్స్ చూపించి పబ్బం గడుపుకున్నారని విమర్శిస్తున్నారు.. అయితే ఈ విమర్శలకు అసలు కారణం.. తాజాగా రైతుల పక్షాన టీడీపీ పోరాడడమే.. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

*రైతులతో డ్రామాకు తెరలేపుతున్న వైనం..
వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మద్దతినిస్తుండగా ఏపీలోకి కొన్నివర్గాలను టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందంటూ అక్కడి రైతుల్లో అపోహలు పెంచి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అమరావతి రైతులకు క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధానిని తరలించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలను మూడు రాజధానులు ఏపీకి ఉంటాయని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ అక్కడి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కొందరు ప్యాకేజీ రైతులతో ధర్నాలు, ర్యాలీలు, కొత్తగా యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ రైతుల యాత్రలు కాస్తా తీర్థయాత్రలను తలపిస్తున్నాయన్న చర్చ సాగుతోంది.

అమరావతి రాజధాని పుణ్యమాని ఇక్కడి రైతులంతా రాత్రికి రాత్రే కుబేరులయ్యారు. ఇక్కడి భూములను అమ్ముకొని కోట్ల పడగలెత్తారు. వీరంతా వేరే ప్రాంతాల్లో భూములు కొనుక్కొని దర్జాగా బతుకున్నారు. అలాంటి వారికి రాజధాని ఎక్కడున్న పోయేదేమీ లేదు. మొదట్లో ఇక్కడి రైతులు రాజధాని తరలింపును వ్యతిరేకించినా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని గ్రహించారు. దీంతో క్రమేణ వాళ్ల నిర్ణయంలో మార్పు వచ్చింది. దీంతో బాబుగారు రంగంలోకి దిగి ప్యాకేజ్ రైతులతో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లకు తెరలేపారు. క్రమేణ వీటి ప్రభావం తగ్గడంతో కొత్త రైతు యాత్ర పేరిట డ్రామాలకు తెరలేపుతున్నారు.

ఇటీవల పలువురు రైతులు ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ వెళ్లారు. అక్కడ ‘సేవ్ అమరావతి’ ప్లకార్డు పట్టుకొని రాజధాని తరలిపోకుండా చూడాలని వేడుకున్నట్లు ఫోటోలు దిగి ప్రచారం చేస్తున్నారు. పట్టుమని 20మంది కూడా లేని వాళ్లు రైతు యాత్ర పేరిట ఉత్తర ప్రదేశ్లోని సారనాథ్ కు ఓ తీర్థయాత్రలా వెళ్లడంపై పలువురు విమర్శిస్తున్నారు. నిజం వీరికి రాజధానిపై ప్రేమ ఉన్నట్లయితే ఢిల్లీకి వెళ్లి ప్రధానినో, రాష్ట్రపతినో కలిసి సమస్యను విన్నవించాలి. లేదా పార్లమెంట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేయాలి గానీ ఇలా ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ కు వెళ్లడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నారు. గుడ్డిగా బాబు స్క్రిప్టును ఫాలోవుతున్న ప్యాకేజీ రైతులు ఏపీ ప్రజల ముందు పరువు పొగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రైతులు టీడీపీ మాయలో పడిపోకుండా ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నవారికి సహకరించాలని పలువురు కోరుతున్నారు.