Begin typing your search above and press return to search.

అమరావతి కధలు : రాళ్ళెత్తిన కార్మికులకు పూల స్వాగతం

By:  Tupaki Desk   |   23 April 2022 4:31 PM GMT
అమరావతి కధలు : రాళ్ళెత్తిన కార్మికులకు పూల స్వాగతం
X
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని మహాకవి శ్రీశ్రీ నాడు చాలా కలత చెందారు. అవును నిజమే కదా. ఒక్క తాజ్ మహల్ ఏంటి ఏ ఆసామి అయినా తన సొంతింటి నిర్మాణంలో కూలీ చేసిన వారిని గుర్తుంచుకుంటాడా. వారికి డబ్బులు ఇచ్చాం కాబట్టి కట్టారు అనుకుంటాడు. కానీ వారు తమ చమటను రక్తంగా పెట్టి ఎండలను కొండలను తట్టుకుని దాటుకుని నెలల తరబడి నిర్మాణాలు చేస్తారు.

అలాంటి వారికి చరిత్రలో స్థానం ఉండదు, సగటు మనిషి మెదళ్ళలో కూడా చోటు ఉండదు. కానీ చిత్రంగా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న కార్మికులను మాత్రం గొప్ప భాగ్యం లభించింది. ఎంతో కాలం తరువాత ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత అమరావతి రాజధానిలో ఆగిన నిర్మాణాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి.

వాటిని పూర్తి చేయడానికి వచ్చిన కార్మికులను అమరావతి రాజధాని రైతులు ఎదిరేగి ఘన స్వాగతం పలికిన దృశ్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. హై కోర్టు తీర్పుతో అమరావతి రాజధానిలో నిర్మాణాలు మొదలయ్యాయి.

అప్పట్లో ఆగిపోయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నివాస‌ భవనాలను పరిపూర్తి చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ మధ్య హై కోర్టు తీర్పుతో సర్కార్ ఆ దిశగా అడుగులు వేసింది.

దాంతో నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. వాటి పనుల కోసం వచ్చిన కార్మికులకు అమరావతి ఘనస్వాగతమే పలికింది. స్వయంగా వారి వద్దకు వెళ్ళి వారిని తోడ్కొని రాజధాని ప్రాంతానికి రైతులు తెచ్చారు. తమకు ఇన్నేళ్ళకు న్యాయం జరిగింది అని కూడా మురిసిపోయారు.

పనిలో పనిగా తమ ప్లాట్లను కూడా అభివృద్ధి చేసి ఇస్తే అదే పదివేలు అని కూడా రాజధాని రైతులు అంటున్నారు. మొత్తానికి అమరావతి పేరు గొప్పది. రాజధాని రైతుల పట్టుదల ఇంకా గొప్పది. దాంతో వారికి న్యాయం జరిగింది అంటున్నారు. అందుకే రాళ్ళెత్తిన కూలీలను కూడా వారు గొప్పగా గౌరవిస్తున్నారు.