Begin typing your search above and press return to search.

తిరుగులేదనుకున్న చోట వ్యతిరేకతా?

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:00 AM IST
తిరుగులేదనుకున్న చోట వ్యతిరేకతా?
X
మొన్నటి వరకు ఈ ప్రాంతంలో తమకు తిరుగేలేదని తెలుగుదేశంపార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాంటిది పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గో బ్యాక్ అంటూ వినిపించిన నినాదాలతో నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో రాజధాని నియోజకవర్గమైన తాడేపల్లిలో కూడా వైసీపీ అభ్యర్ధి ఉండవల్లి శ్రీదేవే గెలిచారు. దాంతో రాజధాని నియోజకవర్గాల్లో కూడా టీడీపీపై బాగా వ్యతిరేకత ఉందనే విషయం బయటపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఎప్పుడైతే జగన్ ప్రతిపాదన జరిగిందో అప్పటి నుండి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన గ్రామాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. అదికాస్త చివరకు ఉద్యమం రూపంలోకి మారింది. ఈ ఉద్యమమే 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగానే చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అమరావతికి ఆరురోజుల క్రితమే చేరుకున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ రాజధాని గ్రామాలైన తాడేపల్లి, దొండపాడు, ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగానే దొండపాడు చేరుకోగానే ఒక్కసారిగా వ్యతిరేకత ఎదురయ్యింది.

దీనికి కారణం ఏమిటంటే ఆదివారం జరిగిన ఓ ట్రాక్టర్ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందారు. రాజధాని ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం కోసం చుట్టు పక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలోనే దొండపాడు నుండి బయలుదేరిన ఓ ట్రాక్టర్ ఢీ కొనటంతో రెబ్బమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ దొండపాడు గ్రామంలో పర్యటనలో మృతురాలి ఇంటికి వెళ్ళటంతో ఉద్రిక్తత మొదలైంది. ఉద్యమం నేపధ్యంలో మహిళలను తీసుకెళుతున్న సమయంలోనే ట్రాక్టర్ ప్రమాదంలో మరణించందంటూ లోకేష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో అందరు నివ్వెరపోయారు. తర్వాత కొద్దిసేపు అక్కడే ఉండి చేసేది లేక వెనక్కు వెళ్ళిపోయారు.