Begin typing your search above and press return to search.

నిరసనకు అవకాశం లేకుంటే త్రీవవాదుల్లో కలుస్తారట!!

By:  Tupaki Desk   |   20 Aug 2020 3:20 PM IST
నిరసనకు అవకాశం లేకుంటే త్రీవవాదుల్లో కలుస్తారట!!
X
ఏపీ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్న వేళ.. రాజధాని అమరాతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీవీ చానళ్లలో పెద్దగా కవర్ కాని ఈ ఉదంతంలో రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు.. పోలీసులకు పెద్ద ఎత్తున వాదనల చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరుపై రాజధాని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి నిరసనలకు తాము అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఆగ్రహాన్ని.. ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి కోసం ఆందోళన చేస్తున్న తమ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు.. మహిళలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమ గోడును పట్టించుకునే నాథుడే లేనప్పుడు.. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేనప్పుడు తీవ్రవాదుల్లో కలవటమే మంచిదంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తాము ఎదుర్కొంటున్న పరిస్థితులపై రాష్ట్రపతి కోవింద్ కు లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో సీఎం జగన్ రాజధాని గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉన్నందున.. ఆయా గ్రామాల్లో పోలీసులు హడావుడి ఎక్కువగా కనిపించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు రైతు నాయకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిరసన శిబిరాల్ని బలవంతంగా ఖాళీ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

తాము ఎవరి కాన్వాయ్ ను అడ్డుకోమని.. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతామని మహిళలు దండాలు పెట్టి.. వేడకున్నా పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. తాము 246 రోజులుగా రాజధాని అమరావతిని కొనసాగించాలని కోరుతూ నిరసన చేస్తున్నామని.. అయినా తమను పట్టించుకోవటం లేదన్నారు. కరోనా వేళ.. ప్రాణాలకు తెగించి నిరసన తెలుపుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఎంత పోలీసులు అడ్డుకుంటే మాత్రం తీవ్రవాదుల్లో కలుస్తామన్న మాటలు రాజధాని రైతులకు నష్టం జరిగేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు. కడుపు మండినప్పుడు ఎంత పడితే అంతగా మాటలు మాట్లాడేయటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు.