Begin typing your search above and press return to search.

క‌ర‌ణం బ‌ల‌రాంపై ఆమంచి ఇప్పుడు త‌గ్గాల్సిందేనా!

By:  Tupaki Desk   |   12 March 2020 5:18 PM GMT
క‌ర‌ణం బ‌ల‌రాంపై ఆమంచి ఇప్పుడు త‌గ్గాల్సిందేనా!
X
మొత్తానికి క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యారు. ద‌శాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వీర‌సైనికుడుగా ఉంటూ వ‌చ్చారు ఆయ‌న‌. చంద్ర‌బాబు నాయుడుకు న‌మ్మిన బంటులా ప‌ని చేశారు. ఇప్పుడు ఆయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న కుటుంబీకులు, అనుచ‌రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని అధికారికంగా పుచ్చుకున్నారు. ఆయ‌న మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. టెక్నిక‌ల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు కాలేదు బ‌ల‌రాం.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నెగ్గారు ఆయ‌న అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గి 23 మందిలో ఆయనా ఒక‌రు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జ‌గ‌న్ గాలిలో ఆయ‌న గెలిచి నిలిచారు. దానికి కొన్ని కార‌ణాలున్నాయి. అంత వ‌ర‌కూ ఇండిపెండెట్ క‌మ్ తెలుగుదేశం పార్టీ అనుబంధ స‌భ్యుడిగా ఉండిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అంత వ‌ర‌కూ హార్డ్ కోర్ టీడీపీ నేత‌లా మాట్లాడిన ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో చేరి పోటీ చేశారు. దాన్ని జ‌నాలు ఆమోదించిన‌ట్టుగా లేరు. అంత‌కు ముందు ఐదేళ్ల కింద‌ట ఆమంచిని ఇండిపెండెంట్ గా గెలిపించిన జ‌నాలు, జ‌గ‌న్ గాలిలో మాత్రం ఆయ‌న‌ను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించ‌లేదు.

అయితే ఎన్నిక‌లు అయిన త‌ర్వాత ఆమంచి విమ‌ర్శ‌లు చేశారు. క‌ర‌ణం బ‌ల‌రాం ను టార్గెట్ చేశారు. ఆయ‌న ఎమ్మెల్యేగా అన‌ర్హుడ‌ని కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో క‌ర‌ణం బ‌ల‌రాం కుటుంబ వివ‌రాల‌ను పూర్తిగా పేర్కొన‌లేద‌ని, సెకెండ్ ఫ్యామిలీ అంటూ.. ఆమంచి ఏదో పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టుగా ఉన్నారు. అది ఏ మేర‌కు విచార‌ణ జ‌రిగిందో పెద్ద‌గా వార్త‌లు రాలేదు కానీ, ఇప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీకి ద‌గ్గ‌ర కావ‌డంతో త‌ప్ప‌నిస‌రిగా అయినా ఆమంచి ఆ పిటిష‌న్ ను వెన‌క్కు తీసుకోవాల్సి ఉంటుందేమో!