Begin typing your search above and press return to search.

ఆమంచిని సస్పెండ్ చేస్తారా?

By:  Tupaki Desk   |   2 Sept 2020 10:30 AM IST
ఆమంచిని సస్పెండ్ చేస్తారా?
X
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల మధ్య రచ్చ రచ్చ జరుగుతోందని నియోజవర్గంలో కోడై కూస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేకు.. వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు మధ్య ఫైట్ రసకందాయంలో పడిందని అంటున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల రచ్చ పీక్స్ కు చేరిందట.. చీరాల గడియా స్తంభం దగ్గర వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ వర్గీయులు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద కరణం వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టారు. తమ ఫ్లెక్సీలే కట్టాలంటూ ఆమంచి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఆమంచి వర్గీయులు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు.

ఈ పరిణామాలన్నీ గమనిస్తే నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచి ఎపిసోడ్ సెగలు కక్కుతోందని అర్థమవుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆమంచి కృష్ణమోహన్ ను అదే జిల్లాలోని పర్చూర్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వెళ్లాలని హైకమాండ్ చెప్పింది. కానీ ఆమంచి వినకుండా చీరాలలోనే ఉంటూ రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

దీంతో ప్రతీసారి పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనుషులకు , ఆమంచికి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్తున్నాయంటున్నారు. ఆమంచి వినకుండా ఇలానే వ్యవహరిస్తే ఆయనను సస్పెండ్ చేసే పరిస్థితి రావచ్చని.. అక్కడదాకా తెచ్చుకోవద్దని హైకమాండ్ సున్నితంగా హెచ్చరించే పరిస్థితి అక్కడ ఉందని అమరావతి టాక్.