Begin typing your search above and press return to search.

ఆమంచిని పట్టించుకోని వైసీపీ అధిష్టానం

By:  Tupaki Desk   |   21 May 2020 11:30 AM GMT
ఆమంచిని పట్టించుకోని వైసీపీ అధిష్టానం
X
భర్త లేని విధవని.. పదవి లేని రాజకీయ నాయకుడిని ఎవరూ పట్టించుకోరనే నానుడి రాజకీయాల్లో ఉంది. అది ఇప్పుడు అక్షరాల నిరూపితమవుతోంది. రాజకీయ పదవి లేని వారిని చీపురుపుల్ల కంటే హీనంగా చూసే సంస్కృతి మన రాజకీయాల్లో ఉంది. నేతలు కూడా పదవి లేని కారణంగా బయటకు రాకుండా మౌనంగా ఉండిపోతారు. చాలా మంది కనుమరుగైపోతారు కూడా.

ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. వైసీపీ ఇన్చార్జి ఓ వైపు.. టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి వైసీపీలో చేరి చక్రం తిప్పుతున్న నేత మరోవైపు చేరి ప్రకాశం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు.

చీరాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల పంచాయితీ ఇప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు చేరింది. వివిధ అంశాల్లో ఆధిపత్యంపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్, అటు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ లు పరస్పరం మంత్రి బాలినేనికి ఫిర్యాదు చేశారు. దీంతో చీరాల రాజకీయం రచ్చకెక్కింది.

మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ చేరి చీరాల టికెట్ పొంది పోటీచేశారు. ఓడిపోయారు. దీంతో వైసీపీ చీరాల ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. కొద్దినెలల క్రితమే టీడీపీ నుంచి పోటీచేసి ఆమంచిని ఓడించిన ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో అధిష్టానం ఆయనకే ప్రాధాన్యం ఇస్తోంది.

ఇటీవల వలంటీర్ల నియామకాల సందర్భంగా కరణం వర్సెస్ ఆమంచి ఫైట్ ప్రారంభమైంది. తమ అనుచరులకు పోస్టులు ఇప్పించుకునేందుకు ఇద్దరూ పోటీపడగా.. మంత్రి బాలినేని సిఫార్సు మేరకు ఉద్యోగాలు లభించాయి. కరణం వర్గానికే ఎక్కువ పోస్టులు దక్కాయి. దీంతో ఆమంచి నొచ్చుకున్నారు.

తాజాగా అధికారుల బదిలీల వ్యవహారం తెరమీదకు వచ్చింది. పోలీస్ సహా ఇతర శాఖల ఉద్యోగుల బదిలీపై ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్ మంత్రి బాలినేని కలిసి బదిలీల జాబితాను అందజేసినట్టు తెలిసింది. ఆమంచి అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేశారట.. విషయం తెలుసుకున్న ఆమంచి, ఆయన సోదరుడు కూడా విజయవాడ వెళ్లి మంత్రి బాలినేనిని కలిశారు. పరస్పరం ఇద్దరూ ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విషయంలోనూ అధిష్టానం ఎమ్మెల్యే కరణం బలరాం వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీలో ఆమంచిని పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ఆయన అనుచరగణం రగిలిపోతోంది. కూరలో కరివేపాకులా ఆమంచిని ట్రీట్ చేస్తున్నారని.. టీడీపీ నుంచి వచ్చి చేరిన కరణంకే ప్రాధాన్యత దక్కుతోందని ఆమంచి వర్గం రగిలిపోతోందట.. మరి ఈ ఆధిపత్య పోరు ఎటువైపుకు దారితీస్తుందనేది వేచిచూడాలి.