Begin typing your search above and press return to search.

చీరాల‌లో పొలిటిక‌ల్ కాక‌...

By:  Tupaki Desk   |   9 Aug 2019 7:53 AM GMT
చీరాల‌లో పొలిటిక‌ల్ కాక‌...
X
ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతం. అభివృద్ధి - ఆదాయంలోనూ వెనుకబడిన ఈ జిల్లా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ ముందుంటోంది. ముఖ్యంగా వైరి పక్షాల మధ్య అనేకన్నా.. వ్యక్తుల మధ్య రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. పార్టీలతో సంబంధం లేకున్నా.. వ్యక్తులుగా ఇక్కడ ఆధిపత్యం చలాయించాలని - తమ మాటే నెగ్గాలని భావిస్తున్న నాయకుల కారణంగా చీరాల రాజకీయాలు గడిచిన ఐదేళ్లుగా ఇప్పుడు కూడా హాట్‌ హాట్‌ గానే మారుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రభుత్వ వర్గాలు హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

విషయంలోకి వెళ్తే.. కాపు వర్గాని చెందిన ఆమంచి కృష్ణమోహన్‌ చీరాలలో తన ఆధిపత్యం నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత - కమ్మ వర్గానికి చెందిన కరణం బలరాం కూడా ఇక్కడ తనదే పై చేయి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తెరచాటుగా యుద్ధం ప్రారంభించేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలై రెండు నెలలు కూడా పూర్తి కాకముందుగానే నియోజవకర్గంలో పాలిటిక్స్‌ అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి.

ఆమంచి గత ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇండిపెండెంట్‌ గా గెలిచినా.. ఆయన తర్వాత కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో తన మాటే చెల్లాలనే ధోరణిని ప్రదర్శించారు. ఇక, టీడీపీ సీనియర్‌ నేత - వివాదాలకు కేంద్ర బిందువు వంటి కరణం బలరాం.. తన సొంత నియోజవకర్గం అద్దంకిని విడిచి పెట్టి అధినేత చంద్రబాబు సూచనల మేరకు చీరాలలో పోటీ చేసి గెలిచారు. నిజానికి ఇప్పటి వరకు ఆమంచి - కరణంలు వేర్వేరు నియోజకవర్గాలు కావడంతో ఇరువురి మధ్య పెద్ద ఘర్షణలు లేవు. అయితే, ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేయడంతో వీరిద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్థం ఏర్పడింది.

అయితే, ఇది ఎన్నికల వరకే పరిమితమై ఉంటే.. ఇప్పుడు చీరాల ప్రశాంతంగా ఉండేది. కానీ, ఎన్నికల తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఆధిపత్య రాజకీయం ఏర్పడింది. నేను ఓడినా నా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నామాటే చెల్లాలని ఆమంచి అధికారులకు పోన్లు చేస్తూ.. పనులు చేయించుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేనే అన్నింటా చక్రం తిప్పుతానని కరణం పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విలేజ్‌ వలంటీర్ల నియామకం విషయం ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర యుద్ధానికి కారణమైంది.

ఆమంచి వర్గం సూచించిన అభ్యర్థులకు ఎంపీడీవో ఇక్కడ వలంటీర్లుగా నియమించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఎమ్మెల్యేగా నా అనుమతి అవసరం లేదా? అంటూ.. తెరమీదికి వచ్చిన కరణం.. టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలకు వలంటీర్‌ జాబ్‌ లు ఇవ్వాలంటూ.. ఏకంగా కొందరిని ఎంపీడీవో కార్యాలయానికి పంపి.. పేర్లు నమోదుచేయించారు. దీంతో ఇది ఆమంచి వర్సెస్‌ కరణం ఆధిపత్య రాజకీయంగా మారడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.