Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో ఏపీ ఎంపీకి అవ‌మానం

By:  Tupaki Desk   |   11 May 2017 1:12 PM IST
కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో ఏపీ ఎంపీకి అవ‌మానం
X
ఏపీకి చెందిన ఎంపీకి ఘోర అవ‌మానం ఎదురైంద‌ట‌. ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. అమ‌లాపురం ఎంపీ ర‌వీంద్ర బాబు త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని వెల్ల‌డించారు. త‌న కుమార్తె వివాహం కోసం పెళ్లిప‌త్రిక‌లు తీసుకొని.. కేసీఆర్ కు ఇచ్చేందుకు వెళ్లిన ఆయ‌న‌కు అనుకోని అవ‌మానం ఎదురైంద‌ని చెప్పిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

త‌న కుమార్తె పెళ్లి ప‌త్రిక‌లు ఇచ్చేందుకు కేసీఆర్ క్యాంపు కార్యాల‌యానికి తాను బుధ‌వారం వెళ్లాన‌ని.. తాను అమ‌లాప‌పురం ఎంపీన‌ని చెప్పినా.. క్యాంపు ఆఫీసు సిబ్బంది అవ‌మానించార‌న్నారు. సీఎం లేర‌ని భ‌ద్ర‌తా సిబ్బంది చెప్పార‌ని.. పేషీలో పెళ్లికార్డు ఇస్తాన‌ని చెప్పినా ప‌ట్టించుకోలేద‌న్నారు. ఎంపీగా త‌న గుర్తింపు కార్డును చూపించినా క్యాంప్ ఆఫీసులోకి అనుమ‌తించ‌లేదని.. త‌న వివ‌రాల్ని త‌నిఖీ చేసుకోవాల‌ని అర‌గంట టైమిచ్చినా ప‌ట్టించుకోలేద‌న్నారు.

మండే ఎండ‌లో రోడ్డు మీద‌నే ఉండిపోయాన‌ని.. క్యాంప్ ఆఫీసు ప్ర‌ధాన ద్వారా వ‌ద్ద‌నే త‌న‌ను నిలిపివేసిన వైనాన్ని ఆయ‌న త‌మ‌కు తెలిపిన‌ట్లుగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఎంపీ అయిన త‌న‌కే ఇంత‌లా అవ‌మానం జ‌రిగితే.. సామాన్యుల ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల‌న్న ఆయ‌న‌.. ప్రోటోకాల్ తెలీని భ‌ద్ర‌తా సిబ్బందితో ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌క్క రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో..?