Begin typing your search above and press return to search.

మద్దతు ఇస్తూనే ఏం మాట్లాడావ్ రవీంద్ర !

By:  Tupaki Desk   |   9 Aug 2016 6:03 AM GMT
మద్దతు ఇస్తూనే ఏం మాట్లాడావ్ రవీంద్ర !
X
డిచిన కొద్ది రోజులుగా ప్రత్యేకహోదా అంశం ఏపీని ఊపేస్తోంది. ఏపీలో తాజా పరిస్థితి గురించి లోక్ సభలో చెప్పుకొచ్చారు అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు. సవరణలతో కూడిన జీఎస్టీ బిల్లుపై మాట్లాడే సందర్భంలో.. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పండుల.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరాల్ని చెప్పటమే కాదు.. హోదా విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని ఉదాహరణతో సహా చెప్పుకొచ్చారు. జీఎస్టీ కారణంగా ఏపీకి ఏటా రూ.6800 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నవాదనను వినిపించిన పండుల రవీంద్రబాబు.. తాజా చట్టంతో ఒక దేశం.. ఒకే పన్ను విధానం అన్నట్లుగా జీఎస్టీ బిల్లు ఉందని.. దీనికి తాము మద్దతు ఇస్తామన్నారు.

జీఎస్టీ బిల్లుకు తమ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించాలన్నారు. తమ ఆలోచన.. నిద్ర.. ఆహారం.. సంతోషం.. బాధ అన్ని ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నట్లుగా తేల్చి చెప్పిన ఆయన హోదా అంశంపై తేలకుండా జీఎస్టీ బిల్లుపై చర్చలో పాల్గొంటే తమ ప్రజల నుంచి తాము ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ పొందకుండానే జీఎస్టీ బిల్లు చర్చలో పాల్గొన్నట్లుగా తమ ప్రజలకు తెలిస్తే.. నిలదీస్తారని.. నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉందని ఆయన వాపోవటం గమనార్హం. ప్రత్యేక హోదాపై హామీ పొందకుండా వెళితే.. తమ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తారని.. హోదా మీద హామీ పొందకుండా జీఎస్టీకి ఎందుకు ఆమోదం పలికారని అడుగుతారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా మీద కేంద్ర సమాధానం కావాలని.. ఈ వారంలోసమాధానం వస్తుందని తాము ఆశిస్తున్నట్లుగా చెప్పారు. హోదా అంశంపై ఏపీ ప్రజల్లో ఎంత సెంటిమెంట్ ఉందన్నది అమలాపురం ఎంపీ మాటలు చెప్పకనే చెబుతాయని చెప్పాలి.