Begin typing your search above and press return to search.

గుజరాత్ ఓటమిని ఆయనపైకి నెట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Dec 2017 9:41 AM GMT
గుజరాత్ ఓటమిని ఆయనపైకి నెట్టేస్తున్నారు
X
ఆరునూరైనా నూరు ఆరైనా గుజరాత్‌ లో గెలుస్తామని గట్టి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ కు అక్కడి ఫలితం తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. హార్దిక్ - అల్పేశ్ - జిగ్నేశ్ వంటి స్థానిక హీరోలందరినీ తమవైపు తిప్పుకున్నా బీజేపీని ఏమీ చేయలేకపోవడంతో ఈ ఓటమికి సాకు ఏం చూపాలా అని కాంగ్రెస్ తీవ్రంగానే వెతుకుతోంది. చివరకు ఒక కారణం రెడీ చేసి పెట్టుకుని దాన్ని తమ హీరోలతో చెప్పిస్తోంది. అందులో భాగంగానే గుజ‌రాత్ ఓబీసీ నేత‌ అల్పేష్ ఠాకూర్‌ తో విశ్లేషణ చేయిస్తున్నారు.

గుజరాత్ ఓటమికి కారణం కాంగ్రెస్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ అని అల్పేశ్ తేల్చాడు. అంతేకాదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ బిజెపి ఏజెంట్ అని ఆరోపించాడు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే కాంగ్రెస్‌ కు గుజ‌రాత్‌ లో విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తిన్నాయ‌ని తేల్చిచెప్పాడు. కాంగ్రెస్‌ను దెబ్బ‌తీసేందుకు బీజేపీ మ‌ణిని వాడుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. కాంగ్రెస్ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌మీక్ష చేసిన రోజునే అల్పేష్ ఠాకూర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇది కాంగ్రెస్ వెర్షనేనని స్పష్టమవుతోంది.

మ‌ణిశంక‌ర్ వ్యాఖ్యల వల్ల గుజ‌రాత్‌ లో చాలా మంది కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో ఉన్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వ్యాఖ్య‌లు అడ్డంపడ్డాయని అల్పేశ్ అన్నారు. జీఎస్టీ వ‌ల్ల ప్ర‌జ‌ల్లో నెల‌కొని ఉన్న ఆక్రోషాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యామ‌ని కూడా అల్పేష్ ఠాకూర్ తెలిపాడు. సూర‌త్ వంటి ప్రాంతాల్లో మ‌రింత‌గా దృష్టి పెట్టి ఉంటే ఫ‌లితాలు మ‌రింత అనుకూలంగా వ‌చ్చేవ‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు. మొత్తానికి రాహుల్ అధ్యక్ష కిరీటం పెట్టుకున్న సందర్భంలోనే ఎదురైన ఈ ఓటమిని పాపం.. సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌ పై నెట్టేశారన్నమాట. ఒక్క మాటకే అంత ప్రభావం ఉంటే బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆ పార్టీ ఎన్ని చోట్ల ఓడిపోవాలి మరి.