Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తిస్తుందా?

By:  Tupaki Desk   |   12 May 2020 10:30 AM IST
కేసీఆర్ ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తిస్తుందా?
X
క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల టాలీవుడ్ అల్ల‌క‌ల్లోలం అయిన సంగ‌తి తెలిసిందే. షూటింగుల్లేవ్.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ లేవ్.. రిలీజుల్లేవ్.. ఎప్ప‌టికి లాక్ డౌన్ తొల‌గిస్తారు? ఎన్న‌టికి క‌రోనాకు వ్యాక్సిన్ క‌నిపెడ‌తారు? అన్న‌దానిపై అంతా గంద‌ర‌గోళంగా ఉంది. ఓవైపు చైనా వాళ్లు జీవాయుధాల త‌యారీలో బిజీగా ఉన్నారు. కొవిడ్ 19 శాంపిల్ మాత్ర‌మేనంటూ ఓవైపు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఇలాంటప్పుడు ప‌రిశ్ర‌మ‌ల్ని కాపాడుకోవ‌డ‌మెలా?

అందుకే కేంద్రం నుంచి స‌డ‌లింపులు .. అయినా కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం చాలా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌నాలు గుమిగూడేందుకు ఆస్కారం లేకుండా చేసేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తోంది. మాల్స్ మ‌ల్టీప్లెక్సులు తెర‌వ‌డంపైనా.. మంది ఎక్కువ‌గా ఉండే షూటింగుల వ్య‌వ‌హారంపైనా క‌ఠినంగానే ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద తెర - బెల్లితెర పెద్ద‌లు తెలంగాణ సీఎం కేసీఆర్.. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని వంటి వారిని సంప్ర‌దించినా బెట‌ర్ మెంట్ క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా షూటింగుల‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు.

దీంతో ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో ఒక‌టే దిగులు ప‌ట్టుకుంది. ఇలాంటి స‌మ‌యంలో బాస్ అల్లు అర‌వింద్ త‌న‌వైపు నుంచి ఓ కొత్త ప్ర‌తిపాద‌న తెచ్చారు. అదేమిటంటే జ‌నం గుమిగూడ‌కుండా ప‌రిమిత సిబ్బందితో షూటింగుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌న్న‌దే ఆ ప్ర‌తిపాద‌న‌. కేవ‌లం 20 మందితో షూటింగుల‌కు అనుమ‌తించండి. అది కూడా కేవ‌లం ఓటీటీ ఆహా కోస‌మేనంటూ కేసీఆర్ ప్ర‌భుత్వానికి విన్న‌వించార‌ట‌. అస‌లే ప్ర‌జ‌లకు పెద్ద తెర వినోదం లేకుండా పోయింది. దీంతో పాటే బుల్లితెరకు షూటింగుల్లేక పాత‌వే చూస్తున్నారు. ఇలాంటి వేళ ఓటీటీ వేదిక‌పై అయినా సినిమాలు చూపిద్దామ‌ని ప్ర‌తిపాద‌న తెచ్చార‌ట‌.

అంతేకాదు.. ఇక‌పై ఆహా కోసం మినీ వెబ్-సిరీస్ లు చిత్రీక‌రిస్తార‌ట‌. అందుకు అనుమతి కోసం అల్లు అరవింద్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రతిస్పందనను బట్టి ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఓ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ఆశ ప‌డుతున్నార‌ట‌. మ‌రి అయ్యవారు క‌రుణిస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.