Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ అస్సలు నోరు మెదపడం లేదే!

By:  Tupaki Desk   |   11 March 2018 6:58 AM GMT
ఆ ఇద్దరూ అస్సలు నోరు మెదపడం లేదే!
X
ప్రస్తుతం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పార్టీల మధ్య ప్రతిష్టంభన అనేది కేంద్రమంత్రులు ఇద్దరి రాజీనామాలతోనే ప్రారంభం అయింది. అది ఆదిగా భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం విచ్చలవిడిగా మాటల దాడిని ప్రారంభించింది. తెలుగుదేశం అధినాయకుడు పార్టీ శ్రేణులు అందరినీ రెచ్చిపొమ్మంటూ ఆదేశం ఇచ్చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ అసలు వివాదానికి మూలకారకులయిన కేంద్ర మంత్రులు ఇద్దరు ఇప్పటిదాకా నోరు మెదపడం లేదు ఇందులో కూడా ఏదైనా మతలబు ఉందా అనే సందేహాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి.

నిజానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఇద్దరు మోడీ సర్కార్ తో కుమ్మక్కు అయ్యారనే ప్రచారం ఢిల్లీ వర్గాలలో ముమ్మరంగా ఉంది కేంద్ర మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని యధేచ్చగా వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకున్నారనే ఆరోపణ ఉంది.

ప్రత్యేకించి వీరిద్దరిలోనూ కాస్త జూనియర్ అయిన సుజనాచౌదరి కేంద్రమంత్రి పదవి కారణంగా అనల్పమైన వ్యక్తిగత లబ్ధి కూడా చేకూరిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేయడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడిందనేది సమాచారం. పైగా పారిశ్రామికవేత్త కావడంతో - కేంద్రంలో మంత్రిగా ఉన్న హోదాను ఎంత విచ్చలవిడిగా వాడుకోవచ్చో.. అంత విచ్చలవిడిగానూ ఆయన వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేంద్రం ద్వారా అందరికంటె ఎక్కవగా వ్యక్తిగత లబ్ధి పొందినది ఆయనే గనుక.. గతంలో రాష్ట్రం తరఫున తే కేంద్రం వద్దకు చర్చలకు వెళ్లినప్పుడు.. కేంద్రం ఏం చెబితే అది అద్భుతం అంటూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లలో చెబుతూ... ఏపీ ప్రజలను మోసం చేశారే తప్ప.. తొలినుంచి ఇవే కహానీలను కేంద్రంలోని పెద్దలు వినిపిస్తున్నప్పటికీ... వాటి గురించి వాస్తవాలు ప్రజలకు తెలియనివ్వకుండా.. మాయ చేస్తూ రోజులు నెట్టేయడానికి కారణం ఇదే అని పలువురు అంటున్నారు.

అందుచేతనే ఇప్పుడు కూడా ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా ఎక్కడా నోరు మెదపకుండా జాగ్రత్త పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏదో చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆయన రాజీనామా చేశారే తప్ప.. మొక్కుబడి ప్రకటనలు మినహా, ఆయన తో కేంద్రం మీద మాటలు రువ్వేలా చేయడం చాలా కష్టం అని పార్టీ వారే అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న దాడికి సొంత పార్టీలోనే సరైన మద్దతు దక్కడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.