Begin typing your search above and press return to search.

ఫ్లోరింగ్ కుంగకుంటే.. ఆ ఫోటోల మాటేంది?

By:  Tupaki Desk   |   4 July 2016 11:49 AM IST
ఫ్లోరింగ్ కుంగకుంటే.. ఆ ఫోటోల మాటేంది?
X
ఏపీ రాజధాని అమరావతిలో ఇటీవల ప్రారంభించిన తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనానికి దారి తీసిందో చెప్పాల్సిన అవసరం లేదు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ఫ్లోరింగ్ కుంగినట్లుగా ఏపీ విపక్ష నేత జగన్ కు చెందిన మీడియా సంస్థ ఒక వార్తను అచ్చేయటంతో పాటు.. అందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోల్ని ప్రచురించింది. దీంతో.. ఈ వ్యవహారం పెద్ద చర్చనే రేపింది.

తాత్కాలిక సచివాలయం నిర్మాణం మీద సందేహాలు వ్యక్తమయ్యాయి.అయితే.. వీటిని ఏపీ ముఖ్యమంత్రి మొదలు.. మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుడు రాతలు రాస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లగా శాపనార్థాలు పెట్టారు. ఇన్ని చేసిన ఏపీ అధికారపక్షం మీడియా మొత్తాన్ని వెంట బెట్టుకు తీసుకెళ్లి.. సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. ఫ్లోరింగ్ కుంగిపోయింది లేదన్న విషయాన్ని కెమేరా కళ్లకు కనిపించేలా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకని పరిస్థితి.

అందరిని ఆందోళనకు గురి చేసే అంశాల మీద ఏదైనా విష ప్రచారం చేసినప్పుడు.. వాటిని ఉత్త మాటలతో ఖండించే కంటే.. ఆరోపణలు వినిపిస్తున్న ప్రాంతానికి తీసుకెళ్లి.. వాస్తవ పరిస్థితిని మీడియాకు వివరిస్తే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. అందుకు భిన్నంగా మాటలతో ఆరోపణల్ని కొట్టి పారేయటంలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికి జరిగిపోయినా.. ఇకపై మాత్రం.. ఇలాంటి అంశాలు బయటకు వస్తే.. వాటిని ఉత్త మాటలతో ఖండించకున్నా.. మీడియాను తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని చూపిస్తే బాగుంటుంది. మరి.. అలాంటి పనుల్ని ఏపీ సర్కారు చేస్తుందా? అన్నదే అసలు ప్రశ్న.