Begin typing your search above and press return to search.

మంత్రిమాటలు ఎవరైనా నమ్ముతారా ?

By:  Tupaki Desk   |   30 Aug 2021 1:30 AM GMT
మంత్రిమాటలు ఎవరైనా నమ్ముతారా ?
X
'ఎంపిగా ఉన్నప్పటినుండి తనను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు'.. ఇవి తాజాగా మంత్రి మల్లారెడ్డి ఎంపి రేవంత్ రెడ్డి పై చేసిన తాజా ఆరోపణ. మూడు రోజులుగా మల్లారెడ్డి-రేవంత్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తన ఆరోపణల్లో భాగంగా మంత్రి తన కాలేజీల కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని చెప్పటంతో పాటు చాలా ఆరోపణలు సంధించారు. దీనికి మంత్రి శనివారం కౌంటర్ ఇచ్చారు.

ఆ కౌంటర్లో భాగంగానే తాను టీడీపీ ఎంపిగా ఉన్నప్పటి నుండి రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు. ఇఫ్పుడు కూడా తన బ్లాక్ మెయిల్ కంటిన్యు చేస్తున్నట్లు మంత్రి ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. మల్లారెడ్డి ఏమీ లోకం తెలీని అమాయకుడేమీ కాదు. కాలేజీలు నిర్వహిస్తు విద్యా వ్యాపారంలో ఆరితేరిపోయిన వ్యక్తి. అలాగే మల్లారెడ్డికి రాజకీయాలు కూడా కొత్తేమీకాదు. అలాంటి వ్యక్తి టీడీపీలో చేరి ఎంపిగా గెలిచారు.

అప్పట్లో ఇద్దరు టీడీపీలోనే ఉండేవారు కాబట్టి ఇద్దరిమధ్య ఏవైనా ఆధిపత్య గొడవలు ఉన్నాయోమో తెలీదు. మరి తాను అప్పట్లోనే చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేస్తే ఏమి యాక్షన్ తీసుకున్నారో చెప్పలేదు. తనను ఏ విషయంలో రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారో కూడా చెప్పలేదు. ఒకవైపు తాను బ్లాక్ మెయిల్ కు లొంగిపోయే వ్యక్తిని కాదంటునే మళ్ళీ తనను రేవంత్ ఇబ్బంది పెట్టారని మంత్రి చెప్పటమే విడ్డూరం.

సరే టీడీపీలో ఉండగా రేవంత్ ను తాను ఏమీ చేయలేకపోయారంటే ఒప్పుకోవచ్చు. కానీ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎంపిగా గెలిచిన తర్వాత కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తునే ఉన్నారని చెప్పటమే నమ్మేట్లుగా లేదు. ఎందుకంటే అధికారపార్టీ హోదాలో రేవంత్ పై మల్లారెడ్డి ఒక ఫిర్యాదు చేస్తే మిగిలిన విషయాలను పోలీసులే చూసుకుంటారు. ఓటుకునోటు కేసు నేపధ్యంలో కేసీయార్ కు కూడా రేవంత్ అంటే బాగానే మండుతోంది. మరి ఆ విషయం తెలీనంత అమాయకుడు కాదు కదా మల్లారెడ్డి.

పోనీ మంత్రయిన తర్వాతైనా రేవంత్ బ్లాక్ మెయిలింగ్ పై మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసుండచ్చుకదా ఎందుకు చేయలేదు ? అంటే ఇక్కడే మంత్రి ఆరోపణలు నమ్మేట్లుగా లేదు. ప్రభుత్వ భూములను తాను ఆక్రమించుకోలేదని మంత్రే సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటే కుదరదు. ఆ విషయంలో మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వాల్సింది రెవిన్యు అధికారులు. ఇప్పటికే మల్లారెడ్డి భూకబ్జాదారుడనే ముద్రపడిపోయింది. కాబట్టి రేవంత్ పై సింపుల్ గా బ్లాక్ మెయిల్ ఆరోపణలు చేసి తప్పుకుందామంటు కుదరదు.