Begin typing your search above and press return to search.

నో లేట్... పీకే పై ఆళ్ల పంచ్ పడింది

By:  Tupaki Desk   |   30 Aug 2019 3:13 PM GMT
నో లేట్... పీకే పై ఆళ్ల పంచ్ పడింది
X
నవ్యాంధ్ర నూతన రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని - ఈ తరహా చర్యలు ఆపకపోతే సహించేది లేదని జనసేనాని పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ ఇవ్వడమే ఆలస్యం... ఆయనపై పవర్ ఫుల్ పంచ్ పడిపోయింది. రాజధాని రైతులు - రైతు కూలీలు - రాజధాని ప్రాంత ప్రజలతో భేటీ అయిన పవన్... తనదైన శైలిలో గత టీడీపీ సర్కారును అలా అలా ఓ రెండు మాటలనేసి... ఆపై వైసీపీ సర్కారుపై విరుచుకుపడిన విషయం తెలిసిందే కదా. వైసీపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని - రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఒప్పుకునేది లేదని కూడా పవన్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై నెలకొన్న గందరగోళాన్ని పటాపంచలు చేసేందుకు తాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని కూడా పవన్ చెప్పారు.

పవన్ ఇలా వ్యాఖ్యలు చేశారో... ఆ వెంటనే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎంటరైపోయారు. వచ్చీ రావడంతోనే పవన్ కు దిమ్మదిరిగే కౌంటర్లు ఇచ్చేశారు. రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ ఇంతకాలం ఏమైపోయారంటూ తనదైన శైలి సెటైర్లు వేసిన ఆర్కే... రాజధాని రైతులపై పవన్ ది కపట ప్రేమేనని తేల్చి పారేశారు. ఈ సందర్భంగా పవన్ పై ఆళ్ల ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే... చంద్రబాబు నుంచి ప్యాకేజి ముట్టినపుడు ఒకరకంగా - అందనపుడు ఇంకో రకంగా మాట్లాడటం పవన్‌ కు అలవానేనని ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు సంధించా రు. బేతపూడి గ్రామంలో పర్యటించినపుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్‌.. దమ్ముంటే చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను బయట పెట్టాలని సవాల్ విసిరారు.

భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్... నాలుగుసార్లు భూసేకరణ జరిపినపుడు ఏమయ్యారని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. పవన్‌ కు నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయలేదని - కనీసం జనసేన అభ్యర్థినైనా పోటీలో దింపలేదని గట్టిగానే తగులుకున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారనుకున్నా.. వారి కోసం మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదని ఆర్కే ప్రశ్నలు సంధించారు. లోకేష్‌ ను గెలిపించడానికి పవన్‌ తెర వెనుక చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇన్నిరోజుల పత్తాలేని పవన్‌ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు పర్యటిస్తే జనం నమ్మరని ఆర్కే తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.