Begin typing your search above and press return to search.

వైసీపీలో ఒక్క సీటుకు ముగ్గురి పోటీ

By:  Tupaki Desk   |   5 Feb 2017 6:20 AM GMT
వైసీపీలో ఒక్క సీటుకు ముగ్గురి పోటీ
X
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపించింది. టీడీపీలో ఇప్పటికే ఈ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండగా వైసీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా వైసీపీకి ఒక ఎమ్మెల్సీ సీటు ఖాయంగా దక్కుతుంది. దీంతో ఆ ఒక్క సీటుపై చాలామంది ఆశలు పెంచుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు, రీసెంటుగా వైసీపీలో చేరిన వారు ఎవరికి వారు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీలో మొత్తం ఏడు స్థానాలు ఖాళీ కానుండగా అందులో అయిదు టీడీపీకే దక్కనున్నాయి. ఒకటి వైసీపీకి... ఇంకొకటి సంఖ్యాబలం ఎవరికుంటే వారికి దక్కబోతోంది. ఈ తరుణంలో ఖాయంగా దక్కనున్న ఒక్కసీటు కోసం వైసీపీలో ముగ్గురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వారికి మరొకరు జత కలిశారు. కొద్దిరోజుల కిందట వైసీపీలో చేరిన బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. నిజానికి నాని - బాలినేనిలతో పోల్చితే వెల్లంపల్లి రాజకీయంగా తేలిపోతారు. కానీ... విజయవాడకు చెందిన నేత కావడం ఆయనకు ప్లస్ పాయింటుగా మారుతోంది. ఆయన్ను మండలికి పంపిస్తే రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాను టీడీపీ స్వీప్ చేసిన నేపథ్యంలో అక్కడ వైసీపీ బలం పుంజుకోవాలంటే ఆ జిల్లాకు అవకాశం ఇవ్వాలని.. అందుకోసం ఆళ్ల నానికి అవకాశమివ్వాలని జగన్ భావిస్తున్నట్లు టాక్. అయితే... రెండో స్థానానికి పోటీ చేస్తే ఆ ఛాన్సుకు వెల్లంపల్లికి ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ఎటొచ్చీ బాలినేనికి మాత్రం నిరాశ తప్పదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/