Begin typing your search above and press return to search.

లోక్‌ స‌భ ఎన్నిల‌కు స‌ర్వం సిద్ధం.. ఇదే కీల‌కం

By:  Tupaki Desk   |   25 Dec 2018 7:52 AM GMT
లోక్‌ స‌భ ఎన్నిల‌కు స‌ర్వం సిద్ధం.. ఇదే కీల‌కం
X
ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల కమిషన్.. ఐదు నెలల ముందునుంచే లోక్‌సభ ఎన్నికల పై కేంద్రీకరించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను మంగళవారం నుంచి చేపడుతుండగా, సాంకేతిక అంశాల పై కూడా దృష్టిసారించింది. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం 30 రకాల అంశాలను నిర్దేశించింది. ఇందులో కీలకమైన పోలింగ్‌ బూత్‌ ల ఏర్పాటు- సిబ్బంది నియామకం- వారికి తగిన శిక్షణ- పక్కాగా ఓటర్ల జాబితా రూపకల్పన లాంటివి ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల అధికారులు వీటిని పూర్తిచేస్తున్నారు. సంబంధిత నివేదికను త్వరలో సీఈసీకి అందించనున్నారు.

లోక్‌ సభ ఎన్నికకు ఎన్ని ఈవీఎంలు కావాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేల్చుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల పునర్వినియోగం పై నిర్ణయం తీసుకోవాలంటే 90 రోజుల వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ఏ నియోజకవర్గంలోనైనా ఓట్ల లెక్కింపు పై అనుమానాలు, సందేహాలు ఉంటే.. వాటి నివృత్తికిగాను 45 రోజుల తరువాత దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. 90 రోజుల వరకు వచ్చే పిటిషన్ల ఆధారంగా విచారణ జరుగుతుంది. 90 రోజుల తరువాత ఎలాంటి పిటిషన్లు స్వీకరించరు. అప్పటివరకు ఈవీఎంలను ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలులేదు.

రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ నిర్వహించి.. 11వ తేదీన ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపు జరిగినరోజు నుంచి 90 రోజులు అంటే మార్చి పదో తేదీ వరకు ఈ ఈవీఎంలను తిరిగి వినియోగించడానికి ప్రాసెస్‌ చేయడానికి అవకాశం లేదు. ఏ నియోజకవర్గాలకు పిటిషన్లు వస్తే.. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు తిరిగి వినియోగించడానికి వీలుండదు. పిటిషన్లురాని నియోజవర్గాల ఈవీఎంలను పార్లమెంటు ఎన్నికలకు వినియోగించుకోవచ్చు. దీంతో ముందుగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ ల పై ఇండెంట్ పెట్టలేని పరిస్థితి రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏర్పడింద‌ని అంటున్నారు.